కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 7న కొత్తగూడెంలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కోరారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బైక్ ర్యాలీ నిర్వహిస్తారని, ఇటీవల విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను సన్మానిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియతోపాటు దిండిగాల రాజేందర్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
బూర్గంపాడు: పురుగుమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. మండలంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన కుంజా జోగయ్య (28) కొంతకాలంగా మద్యానికి బానిసై.. పనికి వెళ్లకుండా తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. గత నెల 22న పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు పాల్వంచ ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించి ఆదివారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు భద్రు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇల్లెందు మండలంలో యువకుడు..
ఇల్లెందురూరల్: మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఉపేందర్ (30) డిసెంబర్ 28వ తేదీన మహబూబాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
అనారోగ్యంతో బీటీపీఎస్ ఉద్యోగి..
పాల్వంచ: అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న బీటీపీఎస్ ఉద్యోగి రోడ్డు పక్కనే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీనివాసకాలనీకి చెందిన బీటీపీఎస్ ఫోర్‌మెన్ రామాల థామస్ (56) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం మద్య ం సేవించేందుకు బయటకు వెళ్లిన థామస్ తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు పక్కనే పడి మృతి చెందాడు. అయితే, గతంలో అతడికి ఫిట్స్ ఉందని, అనారోగ్యంతో మృతి చెందాడని భార్య ఝాన్సీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశువుల పట్టివేత
మణుగూరుటౌన్: జామాయిల్ తోటలో కబేళాకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న గోవులను ఆదివారం రాత్రి మణుగూరు పోలీసులు గోశాలకు తరలించారు. మండలంలోని రామానుజవరంలో జామాయిల్ తోటలో 26 గోవులను కబేళాకు తరలించేందుకు కట్టేసి ఉంచగా, విషయం తెలుసుకున్న పలువురు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నాగబాబు ఆ గోవులను గోశాలకు అప్పగించారు. పోలీసులకు నాయకులు అభినందనలు తెలిపారు.
కార్మికుడికి గాయాలు
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో విధి నిర్వహణలో ఉన్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. పీఎం–1ఏలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు బత్తుల కిశోర్ చేయి ప్రమాదవశాత్తు రివైండర్‌లో పడింది. తీవ్రంగా గాయపడటంతో అతడిని తోటి కార్మికుల సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కార్మికుడిని ఐటీసీ కార్మిక సంఘాల నాయకులు పరామర్శించారు.


