ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం ఆగదు
● పేదలకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయం ● మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి ● ఏదులాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఖమ్మంరూరల్ : ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ చిత్తశుద్ధితో అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు రూ.56 కోట్ల విలువైన పనులు చేపట్టామని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందకు సాగుతోందని, ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తోందని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తామని, ప్రతీ ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఏదులాపు రం మున్సిపాలిటీ పరిధిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లపై నుంచి విద్యుత్ తీగల తొలగింపు పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో గతంలో వచ్చిన వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు కొంత సాయం చేశామని, భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా రూ.580 కోట్లతో మున్నేరు నదికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో చేపట్టిన పనులు త్వరగా, నాణ్యతగా పూర్తి చేయాలని కమిషనర్‌కు సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం సీపీ సునీల్‌దత్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ ఎస్‌ఈలు యాకోబ్, వెంకటేశ్వర్లు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


