అనాథ మృతదేహానికి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

Jan 3 2026 7:07 AM | Updated on Jan 3 2026 7:07 AM

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో ఉన్న అనాథ మృతదేహానికి అన్నం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. నాలుగు రోజుల క్రితం జూలూరుపాడులో 75 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందగా, మృతదేహాన్ని కొత్తగూడెం సర్వజన వైద్యశాల మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఎవరూ రాకపోవడంతో అనాజత మృతదేహంగా భావించి అన్నం ఫౌండేషన్‌ సహకారంతో పోలీసులు కొత్తగూడెం పట్టణంలో దహన సంస్కారాలు నిర్వహించారు. అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ అన్నం శ్రీనివాసరావు, సిబ్బంది, రామవరం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్‌ ముస్తఫా, హిందూ శ్మశాన వాటిక కాటికాపరి సత్యనారాయణ పాల్గొన్నారు.

రోడ్డుపై ఇసుక డంప్‌.. నిందితులు పరార్‌

దమ్మపేట: ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను మండలంలోని చీపురుగూడెం శివారు డంప్‌ చేసిన వ్యక్తులు లారీతో సహా పరారయ్యారు. ఎస్సై సాయికిషోర్‌రెడ్డి కథనం ప్రకారం.. శుక్రవారం ఏపీ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో చీపురుగూడెం శివారులో కొందరు అడ్డుకుని పోలీసులకు చెబుతామని బెదిరించారు. దీంతో లారీలో ఉన్న వారు అక్కడే ఇసుక డంప్‌ చేసి లారీతో సహా వెళ్లిపోయారు. ఎస్సై, రెవెన్యూ ఉద్యోగులు చేరుకుని ఇసుక సీజ్‌ చేయగా, రవాణాకు పాల్పడిన వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

పేకాట శిబిరంపై దాడి

దమ్మపేట: మండలంలోని గుర్వాయిగూడెం శివారులో పేకాట శిబిరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు. నాలుగు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, రూ.11,310 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

మహిళపై కత్తితో దాడి

బూర్గంపాడు: భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవను నిలువరించేందుకు వెళ్లిన మహిళపై కత్తితో దాడికి పాల్పడ్డ ఘటన మండల పరిధిలోని ఏదుళ్లచెరువులో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివాసీ గ్రామమైన ఏదుళ్లచెరువు గ్రామానికి చెందిన మడివి రాజు(60) అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు. అతని అంత్యక్రియలకు బంధువులైన అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరుకు చెందిన జంపన్న, అతని భార్య ఉమ హాజరయ్యారు. జంపన్న మద్యం మత్తులో భార్యతో గొడవపడుతుండగా, అక్కడే ఉన్న చుక్కమ్మ అనే మహిళ వారించింది. కోపోద్రిక్తుడైన జంపన్న కత్తితో దాడి చేయగా, చుక్కమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానికులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘర్షణలో మహిళకు గాయాలు

దమ్మపేట: కుటుంబ సభ్యుల గొడవను ఆపే ప్రయత్నంలో తోపులాట జరిగి, ఓ మహిళకు శుక్రవారం తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని చీపురుగూడెం గ్రామ సమీప కొత్తూరు కాలనీకి చెందిన బేతిని దుర్గాదేవి అలియాస్‌ తిరుపతమ్మ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. గురువారం అర్ధరాత్రి గ్రామంలో దుర్గాదేవి తండ్రి, సోదరి కుటుంబ సమస్యల కారణంగా గొడవ పడుతున్నారు. గొడవను ఆపేందుకు వెళ్లిన దుర్గాదేవిని తండ్రి నెట్టివేయడంతో పక్కనే ఉన్న సైడ్‌ డ్రెయినేజీలో పడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో శుక్రవారం ఉదయం 108 అంబులెన్స్‌ ద్వారా దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఒడిశా వాసి మృతి

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుర్రాలపాడు వద్ద కారు ఢీకొన్న ఘటనలో రబీంద్ర డాకువా(46) మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పతార్‌పంజికి చెందిన డాకువా గుర్రాలపాడులోని గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లోకి సరుకులు తీసురావడానికి వెళ్తూ రోడ్డు దాడుతుండగా వెంకటగిరి వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల, కాళ్లకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఆయన బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement