రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గురువారం జరిగిన రాష్ట్ర క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా నుంచి 19మంది పాల్గొన్నారు. మహిళల 10 కిలోమీటర్లు పరుగుపందెం విభాగంలో 25 పాయింట్లు సాధించి చాంపియన్‌షిప్ గెలుపొందారు. పాల్వంచకు చెందిన ఉషారాణి, హర్షిత, శ్యామల, అంకంపాలేనికి చెందిన టబు మొదటి 10 స్థానాల్లో మెరుగైనన ఫలితాలు సాధించి చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. భద్రాచలానికి చెందిన సరిత, కాచనపల్లికి చెందిన దుర్గ 2 కిలోమీటర్లు పరుగుపందెంలో మూడు, ఐదో స్థానాలు సాధించారు. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె మహీధర్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. విజేతలతోపాటు కోచ్ నాగేందర్, యర్రయ్య, నాగరాజు, శివలను జిల్లా క్రీడాధికారి ఎం.పరంధామరెడ్డి, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె సారంగపాణి, జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు జి.రాధాకృష్ణ, జాతీయ కోచ్ నాగపురి రమేష్, స్పోర్ట్స్ అథారిటీ కోచ్ శ్రీనివాస్ అభినందించారు.


