వైద్య సేవలపై కలెక్టర్ సమీక్ష
రేపు ఏరియా ఆస్పత్రికి కేంద్రం బృందం రాక..
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో అమలవుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు కామన్ రివ్యూ మిషన్(సీఆర్‌ఎం) బృందం ఆదివారం జిల్లాను సందర్శించింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన సీఆర్‌ఎం బృంద సభ్యులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలు, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, మాతా, శిశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ చర్యలు, వైద్య సేవల విస్తరణ, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యత తదితర అంశాలపై సమీక్షించారు. సీఆర్‌ఎం బృందం ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ వైద్య సంస్థలను సందర్శించి, వైద్య సేవలపై ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా బృందం వైద్య సదుపాయాల అందుబాటు, మౌలిక వసతుల వినియోగం, పేషంట్లకు అందిస్తున్న సేవల నాణ్యతను బృంద సభ్యులు విశ్లేషించనున్నారు. ఈ బృందంలో డాక్టర్ గురీందర్ బీర్‌సింగ్ (అడ్వయిజర్, సీపీసీ పీహెచ్‌సీ, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ), డాక్టర్ బి.వెంకటశివారెడ్డి (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎఐఐఎంఎస్ మంగళగిరి), డాక్టర్ అజయ్‌పాండే(అసిస్టెంట్ ప్రొఫెసర్, పీఆర్‌సీ లక్నో), డాక్టర్ అంకిత కంకర్య (అసిస్టెంట్ ప్రొఫెసర్, పీజీఐఎంఈఆర్, చండీగఢ్), డాక్టర్ అనర్‌సింగ్ డాకర్ (సీనియర్ కన్సల్టెంట్, ఎన్‌హెచ్‌ఎం పాలసీ, ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ), డాక్టర్ కల్పనా భవానియ(సీనియర్ కన్సల్టెంట్, పీహెచ్‌ఏ, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.జయలక్ష్మి, వివిధ ఆరోగ్య ప్రోగ్రామ్ ఆఫీసర్లు, జిల్లా ఆరోగ్య అధికారులు పాల్గొన్నారు.
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రేపు మంగళవారం కేంద్రం బృందం(సీఆర్‌ఎం) సందర్శించనుంది. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమ అమలు తీరుపై పరిశీలించి మొత్తం 32 అంశాలపై లోతుగా ఆరా తీయనున్నారు. కాగా, ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర క్వాలిటీ ఇన్‌చార్జ్ నిరంజన్ సూచించారు. ఈ బృందం భద్రాచలం ఏరి యా ఆస్పత్రిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనుంది.


