ఉత్తిపోతలే..!
రూ.11 కోట్లతో పెద్దవాగు ఆధారంగా నీటి సరఫరా
ట్రాన్స్‌ఫార్మర్ చోరీతో
అందని సాగునీరు
అయినా పట్టించుకోని అధికారులు
రైతుల జీవనాడిపై పాలకుల నిర్లక్ష్యం
ట్రాన్స్‌ఫార్మర్ చోరీతో..
కరకగూడెం: రైతులకు సకాలంలో నీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. అయితకే ఈ పథకాలను సక్రమంగా నిర్వహిస్తే వేలాది ఎకరాల్లో పచ్చదనం నింపి రైతుల ఆశలకు జీవం పోయొచ్చు. కానీ కరకగూడెం మండలంలోని మోతె గ్రామంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఆ లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయింది. ఒకప్పుడు సాగుకు బలమైన ఈ పథకం ఇప్పుడు నిర్వాహణ లోపం, అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు కలిసి అక్షరాలా రైతుల ఆశలపై నీళ్లు పోస్తున్నాయి. పెద్దవాగును ఆధారంగా తీసుకుని రైతుల జీవనాడిగా మారాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు మూలనపడింది. అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. పర్యవేక్షణ లేకపోవడంతో నిరుపయోగంగా మారి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముఖ్యంగా ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి గురై రెండేళ్లు గడిచినా దానిని పునరుద్ధరించకపోవడంతో రైతులకు చివరికి మిగిలింది ఉత్తికోతలేనని పలువురు మండిపడుతున్నారు.
రూ.11 కోట్లతో నిర్మాణం..
రైతుల కష్టానికి ప్రాణాధారంగా ఉండాల్సిన మోతె ఎత్తిపోతల పథకం ఇప్పుడు నిర్వీర్యమై మూలనపడింది. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో నాటి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో సుమారు రూ.11 కోట్ల అంచనాతో ఈ పథకాన్ని నిర్మించారు. పెద్దవాగులోని నీటిని వృథా చేయకుండా మండల పరిధిలోని ఎనిమిది చెరువులకు పైపులైన్ల ద్వారా తరలించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్ట్ ప్రారంభ దశలో సక్రమంగా నడిచినప్పుడు సుమారు 1,023 ఎకరాల భూమికి సాగునీరు అంది రైతులు రెండు పంటలు పండించగలిగారు. వేసవి కాలంలోనూ నీటి ఎద్దడి నివారించడంలో ఇది కీలక పాత్ర పోషించింది. కానీ కాలక్రమేణా సంరక్షణ లోపం, అధికారులు చూపిన నిర్లక్ష్యం, పరికరాల నిర్వహణ లోపం వల్ల ఈ పథకం అచేతనమైంది. పంప్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండిపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా వాగులో నిర్మించిన చెక్‌డ్యామ్‌కు సమానంగా ఇసుక పేరుకుపోవడం, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందకపోవడం వంటి ఇతర కారణాల వల్ల కూడా నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. దీంతో మోటార్లు ఉన్నా.. వాటిని నడిపించేందుకు నీరు లేని పరిస్థితి ఏర్పడింది.
నిరుపయోగంగా
మోతె ఎత్తిపోతల పథకం
మోతె ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్ చోరీతోనే ఉత్తిపోతల పథకంగా మారింది. దాదాపు రెండేళ్ల క్రితం కొందరు దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను పునరుద్ధరించడం గానీ, కొత్తదాన్ని ఏర్పాటు చేయడం గానీ చేయలేదు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తి రక్షణలో ఈ స్థాయి నిర్లక్ష్యం చూపడం ప్రశ్నార్థకంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడంతో ఎత్తిపోతల మోటార్లు పనిచేయక వేలాది ఎకరాల రైతులకు సాగునీరు అందడం లేదు. రైతుల కలల పథకంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ నిర్వహణ లోపాల బారిన పడి మృతప్రాయంగా మారిపోయింది. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకానికి మరమ్మతు పనులతో పాటు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉత్తిపోతలే..!
ఉత్తిపోతలే..!


