నదీ హారతికి వేళాయె..
భద్రగిరిలో ‘దక్షిణ గంగ’కు
పవిత్ర పూజలు
సీతారామలకు, గౌతమీకి
విడదీయలేని బంధం
16న భద్రాద్రిలో పుణ్యనదీ హారతి
భద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో పవిత్ర కార్తీక మాసం వేళ పాప వినాశినిగా పిలిచే గోదావరి మాతకు సమర్పించే ‘పుణ్య నదీ హారతికి’వేళయింది. కార్తీక మాసం బహుళ ద్వాదశి రోజున శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన నదీ హారతిని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈనేపథ్యాన ‘దక్షిణ గంగ’గా పేరుగాంచిన గోదావరి తల్లికి సీతారాములు కొలువై ఉన్న భద్రగిరి పుణ్యక్షేత్రంలో జరపడంతో వేడుకగా మారుతోంది. ఇంతటి మహోత్తర కార్యక్రమాన్ని ఇటీవల మొక్కుబడిగా మార్చడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 16న జరపునున్న గోదావరి నదీ హారతిని భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా జరపాలని పలువురు కోరుతున్నారు.
కార్తీకం వేళ.. పుణ్యఫలం..
మూడు లోకాలలో ఉన్న కోటి తీర్థాలు కేవలం గోదావరిలో మాత్రమే నిత్యం కలిసి ప్రవహించేలా ఉండే వరాన్ని రాముడు ప్రసాదించడని, అందుకే పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం, నదీ హారతి ఎంతో పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యాన ప్రతీ రోజు ఈ గోదావరి తీర్థంతోనే స్వామి వారికి తెల్లవారుజామున ఆరాధన జరుగుతుంది. అంతేకాక నదీ జలంలో అమృతం ఉందని, తద్వారా దీర్ఘాయుషును కలిగిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. భారత దేశంలో నదులను సీ్త్రలకు ప్రతిరూపాలుగా కొలవడం, పూజించడం జరుగుతుందని వేదాలు ప్రస్తుతిస్తున్నాయి. దక్షిణ గంగగా పిలువబడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తున్న ఈ గోదావరి తల్లికి కార్తీక మాసంలో బహుళ ద్వాదశి రోజున భద్రాచల ఫుణ్యక్షేత్రంలో సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను కొలువుదీర్చి పుణ్యనదీ హారతిని సమర్పించడం ఎంతో పుణ్యఫలం.
జీవ నది, విరజా నది గోదావరి..
గౌతమీ మహర్షి వ్యవసాయం చేస్తుండగా గోవు ఆయన పొలంలోకి రాగా, ఆయన ఆవును అదిలిస్తూ తన చేతిలోని గరికను ఆవుపైకి విసురుతాడు. తపోబలం కలిగిన ఆ గరిక వలన గోవు మరణిస్తుంది. పశ్యాతాపం కలిగిన గౌతముడు గోహత్యా పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆ గంగనే నేల మీదకు తీసుకొచ్చాడని, గో పాపాన్ని నివృత్తి చేసుకోవడానికి పుట్టింది కాబట్టే ‘గోదావరి’అని, గౌతమీ మహర్షి రప్పించాడు కాబట్టే ‘గౌతమీ నది’గా ప్రాచుర్యంలోకి వచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయని పండితులు పేర్కొంటున్నారు. శేషతల్పుడైన నారాయణుడు కొలువై ఉన్న వైకుంఠంలో ‘విరజా నది’ఉందని, వైకుంఠం నుంచి భద్రుని తపస్సుతో భద్రగిరి పైన వెలిసిన భద్రాచల క్షేత్రంలో గోదావరిలా మారి, రామయ్య పాదాల చెంత ప్రవహిస్తుందని భక్త రామదాసు తన ‘దాశరధి శతకం’లో పేర్కొన్నట్లుగా ఉంది.
ఎనలేని ఆత్మీయ బంధం..
ఉత్తర భారత దేశంలో అయోధ్యను ఏలే రామయ్యకు, దక్షిణ భారత దేశంలో ప్రవహించే గోదావరి తల్లికి విడదీయలేని అవినాభావ సంబంధం ఉన్నట్లుగా ఇతిహాస పురణాలు చెబుతున్నాయి. 14 ఏళ్ల నాటి తన అరణ్యవాసంలో రెండున్నర సంవత్సరాలు ‘పర్ణశాల’ను సీతమ్మ కోసం నిర్మించి ఇవ్వడంతో పాటుగా అన్యోన్యంగా జీవించింది ఈ పవిత్ర గోదావరి తీర ప్రాంతంలోనే. అదేవిధంగా రావణాసురుడు సీతమ్మ వారిని పర్ణశాల నుంచి అపహరించి ఆకాశ మార్గంలో తీసుకొని వెళ్తుండగా, పక్కనే ప్రవహిస్తున్న గోదావరి తల్లిని రామునికి తన జాడ చెప్పమని మొక్కినట్లుగా పురాణ గాధ ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఈ గోదావరిపై ఉన్న మమకారంతో రామావతార పరిసమాప్తి అనంతరం భద్రుని తపోబలంతో గోదావరి తీర ప్రాంతంలోని భద్రగిరిపై వెలిసి గోదావరి ముఖంగా భక్తులకు దర్శనమివ్వడం భద్రాచల క్షేత్ర ప్రాముఖ్యత.
ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రంలో ప్రతినిత్యం సాయం సమయంలో గంగా నదికి హారతి సమర్పిస్తారు. అదేవిధంగా పవిత్రమైన కార్తీకమాసంలో దక్షిణ గంగగా పిలిచే గోదావరి నదికి హారతిని సమర్పించడం పుణ్యఫలం. మనకు జీవనమై భుక్తిని, ముక్తిని ప్రసాదించే నదులను ఆరాధించే విశిష్టమైన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– ఎస్‌టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు, పండితుడు
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నదీ హారతిని ఇటీవల కాలంలో మొక్కుబడిగా మార్చడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం కిందట ప్రవేశించిన ఈ కార్యక్రమాన్ని తొలుత అట్టహాసంగా జరిపేవారు. గోదావరి తీరంలో వేదికను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలంగా జరిపారు. దీనికై కరపత్రాలు, ఆహ్వాన పత్రాలతో భారీ ఎత్తున ప్రచారం చేసి విజయవంతం చేశారు. అనంతరం కాలంలో దీన్ని మొక్కుబడిగా మార్చి కేవలం ఆ రోజున ఆలయ పండితులు, అర్చకులు తంతను జరిపి తూతూ మంత్రంగా ముగిస్తున్నారు. ఇటీవల ఈఓగా బాధ్యతలు చేపట్టిన దామోదర్‌రావు దీనిపై దృష్టి సారించి పుణ్యనదీ హారతికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. ఈ నెల 16న ఈ వేడుక జరగనున్న నేపథ్యాన ఈఓ దీనిపై ప్రచారాన్ని పెంచాలని, భక్తులను భాగస్వాములను చేయాలని వేడుకుంటున్నారు.
కార్తీకం వేళ గోదారి
తల్లికి నమశ్శతకాలు
నదీ హారతికి వేళాయె..
నదీ హారతికి వేళాయె..


