భద్రాద్రిలో కానరాని కార్తీకం..
● 25 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి ● కరువైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు ● అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
భద్రాచలంటౌన్: పవిత్ర కార్తీక మాసం అంటేనే భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో భక్తుల సందడి, గోదావరిలో పుణ్యస్నానాలతో కళకళలాడుతుంటుంది. అయితే, నేడు కార్తీక రెండో సోమవారం సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 25 అడుగుల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ స్థాయిలో ప్రవాహం ఉన్నప్పటికీ, భక్తులు సురక్షితంగా స్నానాలు ఆచరించేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు పూర్తిగా కరువయ్యాయి.
పటిష్ట చర్యలు శూన్యం..
సాధారణంగా కార్తీక మాసంలో పుణ్య స్నానాల కోసం నదిలోకి దిగే భక్తులు సురక్షితంగా ఉండేందుకు లైఫ్ గార్డులను నియమించడం, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం, ప్రమాద హెచ్చరికలు, తాత్కాలిక కంచెలు (బారికేడ్లు) ఏర్పాటు చేయడం వంటివి తప్పనిసరిగా చేస్తారు. అయితే, ఈసారి అటువంటి పటిష్టమైన చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. నదిలో దిగొద్దని కేవలం ఒకటి, రెండు నామమాత్రపు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.
భక్తుల అసంతృప్తి..
నిరంతరం నిఘా ఉంచాల్సిన పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు ఎవరూ దృష్టి సారించకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.దీపాలు వెలిగించేందుకు, ప్రత్యేక పూజ లు నిర్వహించేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడం అసౌకర్యాన్ని కలిగిస్తోంది. దీంతో పాటు గోదావరి వచ్చి తగ్గడంతో స్నానఘట్టాలు బురదమయమవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భద్రాద్రిలో కానరాని కార్తీకం..


