
థర్మల్ విద్యుదుత్పత్తి అంతంతే!
● కేటీపీఎస్, బీటీపీఎస్ ప్లాంట్లలో రిజర్వ్ షట్‌డౌన్ ● కొద్దిరోజులుగా తగ్గిన థర్మల్ విద్యుత్ వినియోగం
పాల్వంచ: ధర అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం థర్మల్ విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగతా సమయాల్లో యూ నిట్లను రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉంచుతోంది. ఈ క్రమంలో తక్కువ ధరకు వస్తున్న హైడల్, సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని కేటీపీఎస్, బీటీపీఎస్ విద్యుత్ కేంద్రాల్లో పలు యూ నిట్లు రిజర్వ్‌షట్ డౌన్‌లకే పరిమితమవుతున్నాయి. దీంతో జెన్‌కో సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది.
రిజర్వ్ షట్‌డౌన్‌లతో సతమతం
కేటీపీఎస్ 5,6 దశల కర్మాగారంలో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రావాల్సి ఉంది. 5వ దశలోని 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9,10 యూనిట్లు గురువారం వరకు రిజర్వ్ షట్‌డౌన్‌లోనే ఉన్నాయి. అకస్మాత్తుగా 6వ దశలోని 11వ యూనిట్ బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడటంతో వెంటనే రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉన్న 10వ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకుని 11వ యూనిట్‌లో మరమ్మతు పనులు చేపట్టి శుక్రవారం పూర్తి చేశారు. ప్రస్తుతం 9,11 యూనిట్లు రెండూ రిజర్వ్ షట్‌డౌన్‌లోనే కొనసాగుతున్నాయి. వెయ్యి మెగావాట్లకు గాను 750 మెగావాట్లు రిజర్వ్‌షట్‌డౌన్‌లోనే నడుస్తున్నాయి. మణుగూరు బీటీపీఎస్ కర్మాగారంలో 1080 మెగావాట్లు కలిగిన 1,2,3,4 యూనిట్లలో 4,320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 1,2,4 యూనిట్లు రిజర్వ్‌షట్‌డౌన్‌లోనే ఉన్నాయి. ఫలితంగా 3,240 మెగావాట్ల ఉత్పత్తి తగ్గించారు. కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో 800 మెగావాట్లకు గాను 460 మెగావాట్లు మాత్రమే తీసుకుంటూ మిగతాది బ్యాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు. రాత్రి సమయాల్లో ఒకటి, రెండు గంటలు మినహా మిగిలిన సమయాల్లో బ్యాక్ డౌన్‌లో యూనిట్ నడిపిస్తున్నారు. ఈ విషయమై 5,6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావును వివరణ కోరగా.. థర్మల్ యూనిట్‌ఽ ధర ఎక్కువగా ఉందని రిజర్వ్‌షట్‌డౌన్‌లో ఉంచుతున్నట్లు, రాత్రి సమయాల్లో లోడ్ తీసుకుంటూ పగలు తగ్గిస్తున్నట్లు తెలిపారు.