
వడ్డీ వ్యాపారులకు మావోయిస్టుల హెచ్చరిక
దుమ్ముగూడెం: అవసరాన్ని బట్టి పేద ప్రజల వద్ద పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులను హెచ్చరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న పేరుపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అధిక వడ్డీలు కట్టలేని పరిస్థితిలో పేదలు ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలన్నారు. వ్యాపారుల దౌర్జన్యాలు తట్టుకోలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొందరు చనిపోతున్నారని, మరికొందరు ఆస్తులు అమ్ముకుని రోడ్డుపై పడుతున్నారని తెలిపారు.
ఐఎస్‌జీఎఫ్ రాష్ట్ర
ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్
కొత్తగూడెంఅర్బన్: ఇండియన్ స్కౌట్స్, గైడ్ ఫెలోషిప్ (ఐఎస్‌జీఎఫ్) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లోగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి కొత్తగూడెం సింగరేణి చిల్డ్రన్ పార్కులోని భారత్ స్కౌట్స్, గైడ్స్ సింగరేణి కార్యాలయంలో సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి సింగరేణి జీఎం వెల్ఫేర్ కిరణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం ఐఎస్‌జీఎఫ్ జాతీయ అధ్యక్షుడు (ఎగ్జిక్యూటివ్) మ్యాక్ మిక్కి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లోగాని శ్రీనివాస్ పేరును ప్రతిపాదించగా.. అందరూ ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో ఐఎస్‌జీఎఫ్ జిల్లా సభ్యులు పాల్గొన్నారు.
సింగరేణి ఆస్పత్రిలో వైద్యశిబిరం
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యశిబిరం నిర్వహించారు. హైదరాబాద్ నిఖిల్ ఆస్పత్రి నుంచి కార్డియాలజీ – న్యూరాలజీ, యురాలజీ, డెక్కన్ ఆస్పత్రి నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజీ – నెప్రాలజీ వైద్యులు హాజరై సేవలు అందించారు. మొత్తం 143 మందిని పరీక్షించి, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాళేశ్వరరావు, డా.లలిత, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ పీబీ అవినాష్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
పీఈటీ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్‌రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్), ఉపాధ్యక్షులుగా పి.అజయ్, ఎస్.కుమారస్వామి, బి.రమేశ్, జి.సునీత, కోశాధికారిగా ఎస్.కిరణ్‌కుమార్‌గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్, బి.వెంకట్రామ్, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహ్మద్ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది.
ఎస్సీ వర్గీకరణ
ఓ రాజకీయ కుట్ర
ఖమ్మంమామిళ్లగూడెం: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై అతిపెద్ద రాజకీయ కుట్ర జరిగిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్‌ఎస్ రత్నాకర్ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ పేరుతోనే దళితులకు సామాజిక న్యాయం జరుగుతుందా? అని, ముఖ్యమంత్రి పదవికి సామాజిక న్యాయం అవసరం లేదా..? అని ప్రశ్నించారు. పంజాబ్, హరియాణాలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని, దానిని ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తం చేశాడని ఆరోపించారు. శాసీ్త్రయత లేని, రాష్ట్ర జనాభా లెక్కలతో ఎస్సీ రిజర్వేషన్ వల్ల చాలా తక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సమావేశంలో కామ ప్రభాకర్‌రావు, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాలశౌరి, తోట దుర్గాప్రసాద్, కనికెళ్ల నాని, నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

వడ్డీ వ్యాపారులకు మావోయిస్టుల హెచ్చరిక