
నిధులు అరకొరే..
● జెన్‌కో లాభాల్లో 2 శాతం వెచ్చింపుల్లో తేడాలు ● విడుదలైన నిధులు ఇతర ప్రాంతాలకు బదలాయింపు ● పాల్వంచకే కేటాయించాలని డిమాండ్
సీఎస్‌ఆర్ నిధుల కోసం జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపిస్తే వాటిని జెన్‌కో యాజమాన్యం పరిశీలించి విడుదల చేస్తోంది. అయితే వీటిని ఎక్కడ ఖర్చు చేయాలనేది మాత్రం మా పరిధిలో లేదు. జిల్లా అధికారులే చూస్తారు. రెండు సంవత్సరాల కాలంలో కొత్తగూడెం, పాల్వంచ మైనార్టీ, బీసీ కళాశాలల్లో భవనాలు, ఆడిటోరియం నిర్మించారు. ఇతర అభివృద్ధి పనులను కూడా అధికారులే చూడాల్సి ఉటుంది.
– శ్రీనివాసబాబు, సీఈ, కేటీపీఎస్ 7వ దశ
పాల్వంచ: పరిశ్రమల సామాజిక బాధ్యతగా వెచ్చించాల్సిన నిధులు అరకొరగానే విడుదల చేస్తున్నారు. కర్మాగారాల నుంచి నిత్యం వెలువడే కాలుష్య ఉద్గారాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఆయా ప్రాంతాల వారికి వైద్య సౌకర్యాలతో పాటు, అభివృద్ధికి తమవంతు సహకారం అందించాల్సి ఉంటుంది. పాల్వంచలోని కేటీపీఎస్ కర్మాగారం నుంచి నిత్యం 1,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలో బొగ్గును మండించడం ద్వారా జల, వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. కాలుష్యం వల్ల ఈ ప్రాంత ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతుండటంతో యాజమాన్యం సామాజిక బాధ్యతగా ఏటా సీఎస్‌ఆర్ నిధులు విడుదల చేసి, అభివృద్ధిలో భాగస్వామి కావాల్సి ఉంది. కానీ, దీనిని పాటించడంలో జెన్‌కో యాజమాన్యం, జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చాలీచాలని నిధులు..
సీఎస్‌ఆర్ నిధులు విడుదల కోసం జిల్లా కలెక్టర్ జెన్‌కో యాజమాన్యానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది. అనంతరం కలెక్టర్ ఖాతాలోకి నిధులు విడుదల చేస్తారు. వాటి నుంచి కలెక్టర్ సూచించిన చోట అభివృద్ధి పనులు చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో సీఎస్‌ఆర్ నిధులను కొత్తగూడెం, మహబూబాబాద్ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులకు కేటాయించినట్లు సమాచారం. కర్మాగారం ఉన్న పాల్వంచలో ప్రజలు కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతుండగా ఆ నిధులను ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలకు కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 2022–23లో రూ.కోటి నిధులకు ప్రతిపాదనలు పంపించగా రూ.30 లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.70 లక్షలు ఖర్చుచేయాల్సి ఉంది. 2023–24లో రూ.3.72 కోట్లు విడుదల కాగా నిధులు ఖర్చు చేశారు. ఇక 2024–25 సంవత్సరంలో రూ.1.07 కోట్లకు ప్రతిపాదనలు పంపించగా నిధులు మంజూరైనా వాటిని ఇంకా అధికారులు ఖర్చు చేయకుండా పెండింగ్‌లో ఉంచారు. ఏడాది ముగుస్తున్నా అధికార యంత్రాంగం ఈ నిధులను ఇంకా ఎక్కడ వినియోగించాలనేది తేల్చక తాత్సారం చేస్తున్నారు.
2 శాతం కేటాయింపులేవి
జెన్‌కో యాజమాన్యం ఏటా లాభాల్లో 2 శాతం సీఎస్‌ఆర్ నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులు అతి తక్కువగా మాత్రమే విడుదల అవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఏర్పాటు చేయాలని, తరచూ వైద్య శిబిరాలు, నాణ్యమైన విద్య, ప్రజలకు నిత్యం ఉపయోగ పడే చోట అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రణాళికలు, నర్సరీల ఏర్పాటు, రోడ్ల విస్తరణ, వృత్తి విద్య, ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలం చెందారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు లాభాల వాటలోని 2 శాతం నిధులు వెచ్చించడంతో పాటు, వాటిని స్థానికంగానే ఖర్చు చేయాలని, శాశ్వత ప్రాతిపాదికన సమస్యలకు పరిష్కార మార్గాలు రూపొందించాలని ప్రజలుకోరుతున్నారు.

నిధులు అరకొరే..