
పట్టదా ఎవరికీ..?
పర్యవేక్షణ కరువు..
గంటల కొద్దీ ప్రయాణంతో ప్రజలు బెంబేలు రోడ్ల పర్యవేక్షణ గాలికొదిలేసిన పాలకులు ప్రజా ప్రతినిధులపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల పరిధిలో దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు నిర్వహించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఈ సమస్యను ఇటు తెలంగాణలోని కాంగ్రెస్, అటు ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో ప్రజాపోరాటానికి సిద్ధమవుతాం.
–రావులపల్లి రాంప్రసాద్, బీఆర్‌ఎస్ నాయకులు
భద్రాచలం: భద్రాచలం నుంచి చర్లకు వెళ్లి రావాలంటే ప్రయాణికులకు నరకమే. ఆ మార్గంలో గాయపడకుండా.. ఇబ్బంది లేకుండా ప్రయాణించలేం. గుంతలమయమైన రహదారిలో ఇసుక లారీలు నిరంతరం తిరుగుతుండటంతో ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. దీంతో గంటల కొద్ది ప్రయాణికులు నిరీక్షిస్తూ నానా అవస్థలు పడుతున్నారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే వరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం ినియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యగా ఉన్న దీనిపై రెండు ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు మౌనం దాల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అడుగుకో గుంత..
భద్రాచలం నుంచి చర్లకు వయా దుమ్ముగూడెం మండలం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అందులో లక్ష్మీనగరానికి వెళ్లే దారిలో ఏపీ రాష్ట్రం ఏడు కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఏపీలోని చింతలగూడెం, సీతంపేట, కన్నాయిగూడెం, తెలంగాణలోని దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక డైవర్షన్ రోడ్డు, కల్వర్టు, నర్సాపురం, రేగుబల్లి, గంగోలు, బుర్రవేముల, లక్ష్మీనగరం, ములకలపాడు, దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు వరకు రోడ్లన్నీ గుంతలమయమే. చర్ల మండలంలో సుబ్బంపేట, కొయ్యూరు, చర్ల, రైస్‌పేట, గుంపెనగూడెం, కలివేరు, కుదునూరు, దేవరపల్లి గ్రామాల్లోని ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే చర్ల నుంచి వెంకటాపురం రోడ్డు సైతం పూర్తిస్థాయిలో పాడైపోయింది. అడుగు దూరానికో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. అడుగు నుంచి రెండు అడుగుల లోతులో భారీ గుంతలు ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
పర్ణశాలకు తగ్గిన భక్తుల రాక..
భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న అనంతరం అనుబంధ ఆలయంగా ఉన్న పర్ణశాలకు భక్తులు వెళ్లటం పరిపాటి. దుమ్ముగూడెం మండలంలో ఉన్న పర్ణశాలకు ఈ రహదారే మార్గం. ప్రస్తుతం రోడ్డు తీవ్రంగా దెబ్బతిని ఉండటంతో భక్తులు పర్ణశాలకు సైతం వెళ్లలేని దుస్థితి నెలకొంది. కేవలం భద్రాచలం రామయ్యను దర్శించుకొని తిరుగుబాట పడుతున్నారు. దీంతో పర్ణశాలకు భక్తుల రాక తగ్గటంతో పాటుగా ఆదాయం గణనీయంగా తగ్గింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిరు వ్యాపారుల జీవనోపాధికి గండి పడింది.
ఇటీవల కాలంలో చర్ల ఇసుక ర్యాంపుల నుంచి లారీలు దుమ్ముగూడెం, భద్రాచలం మీదుగా వెళ్తున్నాయి. గుంతలతోనే వేగలేకపోతున్న ప్రయాణికులు లారీల రాకపోకలతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన రహదారులను ఆర్‌అండ్‌బీ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలోని టీడీపీ రహదారుల పర్యవేక్షణను గాలికొదిలేశాయి. మట్టితో గుంతలను తూతూమంత్రంగా పూడుస్తున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనపడకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ, ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ప్రధాన రహదారికి మరమ్మతులు నిర్వహించాలని, ఇసుక లారీలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు సైతం నిరసన కార్యక్రమాలతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.
భద్రాచలం – చర్ల రహదారి గుంతలమయం..