
హాహాకారాలు.. ఆర్తనాదాలు
పాత సారపాక మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
డ్రైవర్లు సహా 32మంది
ప్రయాణికులకు గాయాలు
బూర్గంపాడు: పాత సారపాక మూలమలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్ర గాయాలై హాహాకారాలు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో బస్సు భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్తోంది. అదే సమయంలో కొత్తగూడెం నుంచి భద్రాచలానికి కొత్తగూడెం ఆర్టీసీ డిపో బస్సు వస్తోంది. ఈ క్రమంలో పాత సారపాక మూలమలుపు వద్ద ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ కొన్నాయి. దీంతో ఓ బస్సు కేబిన్‌లో మరో బస్సు కేబిన్ ఇరుక్కుపోయాయి. ఈ ఘటనలో రెండు బస్సుల డ్రైవర్లతోపాటు బస్సుల్లో ఉన్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదకరమైన ఈ మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సును గమనించి తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్లు చెబుతున్నారు. ప్రమాదంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్‌ఐలు మేడ ప్రసాద్, నాగబిక్షంలు ఘటనాప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఒకదాంట్లో మరొకటి ఇరుక్కుపోయిన బస్సులను జేసీబీ సాయంతో విడదీశారు.
భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు
రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొనటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అరుపులు, కేకలతో ఆర్తనాదాలు చేశారు. చేతులకు, తలకు, కాళ్లకు, ఒంటిపై గాయాలై రక్తం కారుతుండటంతో హాహాకారాలు చేశారు. భద్రాచలంలో బస్సు ఎక్కినవారు తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ పెద్ద గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ డాక్టర్లను, సిబ్బందిని అప్రమత్తం చేసి వైద్యసేవలు అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సారపాక మూలమలుపు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

హాహాకారాలు.. ఆర్తనాదాలు