
అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు..
2న విజయదశమి వేడుకలు..
● ఐశ్వర్యలక్ష్మిగా అమ్మవారి దర్శనం ● నేడు వీరలక్ష్మి అలంకరణలో లక్ష్మీతాయారమ్మవారు
భద్రాచలం: అఖిలాండ కోటి శాసకురాలిగా, కరుణాస్వరూపినిగా అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటూ దీవిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీతాయారమ్మవారు సోమవారం ఐశ్వర్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన జరిపారు. చిత్రకూట మండపంలో జరుగుతున్న శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు యుద్ధకాండ పారాయణం చేశారు.
నేటి వీరలక్ష్మి అలంకార విశిష్టత..
‘దారిద్య్ర ధ్వంసినీందేవీం సర్వోపద్రవవారిణీం..’ అని అమ్మవారిని వీరలక్ష్మీగా కీర్తిస్తుంది పురాణం. దారిద్య్రాన్ని, అన్ని రకాల ఉపద్రవాలను పారదోలే వీరత్వం ఈ అమ్మ సొంతమని, త్రిమూర్తులకు సైతం సాధ్యం కాని మహిషాసురిని, ముగ్గరమ్మల శక్తి స్వరూపంగా ఆవిర్భవించి సంహరించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమ్మను ఆరాధిస్తే అన్ని రకాల దుష్ట శక్తులు, భయాలు, ఉపద్రవాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.
ముత్తంగి అలంకరణలో రామయ్య..
దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అక్టోబర్ 2వ తేదీన విజయదశమిని పురస్కరించుకుని విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రామదాసు మండపం వద్ద ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే అశ్వయుజ పౌర్ణమి రోజున శబరి స్మృతియాత్ర నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.