
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం అమల్లో భాగంగా పంచాయతీల సమగ్రాభివృద్ధి కోసం విలేజ్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. కర్మయోగి కార్యక్రమం కింద గల 130 గ్రామ పంచాయతీల్లో ఈ ప్లాన్ అత్యవసరమని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా బోర్‌వెల్ మరమ్మతులు, కొత్త బోర్లు, రోడ్లు, వాటర్ ట్యాంకులు, విద్యుత్ సదుపాయం, వ్యవసాయ ఆధునికీకరణ, డ్రోన్ల వినియోగం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, విద్యార్థులకు డైనింగ్ హాళ్లు, వైద్య సౌకర్యం పంటల విస్తీర్ణం వంటి అంశాలను యాక్షన్ ప్లాన్‌లో చేర్చాలని ఆదేశించారు. విలేజ్ యాక్షన్ ప్లాన్‌ను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను ఐటీడీఏ పీఓ రాహుల్ పర్యవేక్షిస్తారని తెలిపారు. అక్టోబర్ 2న ఆది కర్మయోగి అభియాన్ అమలవుతున్న 130 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని, ప్రజల అవసరాలు, అభివృద్ధి సూచనలు, కార్యాచరణపై చర్చించాలని సూచించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం