
శ్రీ సరస్వతీదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మవారిని సోమవారం మూలా నక్షత్రం సందర్బంగా శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. అనంతరం చండీహోమం, లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఖమ్మం ఎంపీ ఆర్.రఘురాంరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ, ఆలయ కమిటీ చైర్మన్ ఆయనకు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు.
ఆర్టీసీలో ఉద్యోగాల
భర్తీకి నోటిఫికేషన్
భద్రాచలంటౌన్: ఆర్టీసీలో వేయి మంది డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని, ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. www. tgprb. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 22 – 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు డ్రైవర్లుగా, 18 – 35 ఏళ్ల వయస్సు వారు శ్రామిక్ పోస్టులకు అర్హులని వెల్లడించారు. డ్రైవర్ పోస్టుకు రూ.300, శ్రామిక్ పోస్టుకు రూ.200 చెల్లించి అక్టోబర్ 8నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని పీఓ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎట్టకేలకు దీక్ష విరమణ
● జాయింట్ సర్వేకు ఆదేశించిన కలెక్టర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు.. భూ సమస్య పరిష్కరించాలంటూ ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్ష సోమవారం రాత్రి ముగిసింది. రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు సర్వే చేపడతామని అశ్వారావుపేట తహసీల్దార్ రామకృష్ణ హామీ ఇవ్వడంతో ఆదివాసీలు దీక్ష విరమించి ఇంటిబాట పట్టారు. కాగా, అశ్వారావుపేట తహసీల్దార్, ఎఫ్‌ఆర్‌ఓ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించనున్నట్టు ఆర్డర్ కాపీ అందిన నేపథ్యంలో దీక్ష విరమిస్తున్నటు ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి మడకం నాగేశ్వరరావు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు.
ఉద్యాన పంటలతో
అదనపు ఆదాయం
అశ్వారావుపేటరూరల్: ఉద్యాన పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి జంగా కిషోర్ రైతులకు సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల పరిధిలోని పామాయిల్, కొబ్బరి ఇతర పంటల్లో అంతర పంటలుగా సాగు చేస్తున్న కోకో, వక్క, అరటి, బొప్పాయి, పూల తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతర పంటల సాగుతో ప్రభుత్వం నుంచి సబ్సిడీతోపాటు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అరటి పంట సాగు చేస్తే ఎకరానికి రూ.28 వేలు, బొప్పాయికి రూ.12వేలు, పూల తోటలకు రూ.8వేలు, కోకో పంటకు రూ.12వేలు, మామిడికి రూ.20వేల చొప్పున సబ్సిడీ వస్తుందని వివరించారు. కలుపు నివారణకు ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగిస్తే ఎకరానికి రూ.8 వేల సబ్సిడీ అందుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఈఓ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సరస్వతీదేవిగా పెద్దమ్మతల్లి