
ప్రచార లోపం.. ఉత్సవాలు వెలవెల
● పెద్దమ్మతల్లి ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ ● శరన్నవరాత్రుల వేడుకల నిర్వహణపై నిర్లక్ష్యం ● సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు దాతల అసంతృప్తి
పాల్వంచరూరల్: ఉమ్మడి జిల్లాలో మహిమాన్విత క్షేత్రంగా పేరొందిన శ్రీకనకదుర్గ ఆలయంలో ఈసారి శ్రీదేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు వెలవెలబోతున్నాయి. ప్రచారంలోపం, అరకొర వసతులతో పెద్దమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న వేడుకలకు భక్తుల రద్దీ తగ్గింది. అధికారులు ప్రచారంపై దృష్టిపెట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రారంభోత్సవానికి హాజరుకాని ఎమ్మెల్యే
మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ ఆలయంలో ఏటా దసరాకు ముందు శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ సారి ఈ నెల 22 నుంచి వేడుకలు ప్రారంభంకాగా, వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును ఆహ్వానించినా హాజరుకాకపోవడంతో ఆలయ కమిటీ చైర్మన్ ద్వారానే కలశ పూజలు చేయించి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వేద పండితులను పిలిపించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తక్కుమ మంది మాత్రమే రావడంతో నామమాత్రంగానే పూజలు జరుపుతున్నారు.
ఏర్పాట్లు కరువు
ఉత్సవాల సందర్భంగా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. దీంతో నవరాత్రులకు భక్తుల సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి నిత్యం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించకుంటారు. ఆదివారం అధిక సంఖ్యలో తరలివస్తారు. భద్రాచలం–కొత్తగూడెం జాతీయ రహదారిని ఆనుకునే ఆలయం ఉండటంతో, ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శించుకుని వెళ్తారు. ఇంతగా ప్రసిద్ధి పొందిన ఆలయంలో ఈ సారి దసరా వేడుకలకు ఎండోమెంట్‌శాఖ సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
18 మందికి రుత్వికులకు 12 మందే..
ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఏటా ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి అర్చకులు, రుత్వికులు వచ్చి 9 రోజులు పూజలు చేస్తుంటారు. గతేడాది 18 మంది రుత్వికులు వస్తే ఈసారి 12 మంది మాత్రమే వచ్చారు. పట్టణాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠ చేయడంతో అర్చకులు అటువైపే మొగ్గు చూపారని, ఆలయ ఉత్సవాలకు ఆసక్తి చూపలేదని సమాచారం.
విస్తృత ప్రచారం చేసి ఉంటే..
ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. ఈసారి దాతలకు, వీఐపీలకు ఉత్సవాల ఆహ్వాన పత్రికలు కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. దీంతో అనేక మంది దాతలు ఈఓకు ఫోన్‌చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రచారం విస్తృతస్థాయిలో జరిగి ఉంటే ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చేవారు.

ప్రచార లోపం.. ఉత్సవాలు వెలవెల