
ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు
● ప్రభుత్వ సీసీఏ రూల్స్ వీరికీ వర్తిస్తాయి ● రామాలయ వైదిక సిబ్బందికి జీఓ జారీ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వెలుపల జరిగే ప్రైవేట్ వైదిక కార్యక్రమాలకు ఆలయ అర్చకులు, పండితులు హాజరు కావడానికి అనుమతి లేదని రామాలయ ఈఓ కొల్లు దామోదర్ రావు గురువారం ప్రకటనలో తెలిపారు. దేశ, విదేశాల్లో ఆలయ వైదిక సిబ్బంది తరుచుగా లోక కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, ప్రవచనాలు, వేదసంహిత కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కావటం క్రమశిక్షణను ధిక్కరించినట్లుగా భావిస్తున్నందున, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సీసీఏ రూల్స్ ప్రకారం వైదిక సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా దేశ విదేశాల్లో ఎటువంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించొద్దని, పాల్గొనద్దని తెలిపారు. ఈ ఉత్తర్వులను ధిక్కరిస్తే క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఈఓ మరో ప్రకటనలో తెలిపారు. 29న సాయంత్రం 5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద జరుపుతున్నట్లు వెల్లడించారు.