
ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు!
తనిఖీలు చేస్తాం
దసరాకు వచ్చే ప్రయాణికుల జేబులకు చిల్లు
● టికెట్ ధర మూడింతలు పెంచిన ట్రావెల్స్ నిర్వాహకులు ● చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులు
భద్రాచలంఅర్బన్: దసరా సెలవుల్లో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు దండుకుంటున్నారు. టికెట్ ధరలు రెండు, మూడింతలు పెంచేశారు. ముందస్తు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా.. ప్రయాణికుల వరకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్వీసుల సంఖ్య ప్రకటించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అవకాశం ప్రైవేటు ఆపరేటర్లకు కాసుల పంటగా మారుతోంది.
సాధారణ రోజుల్లో..
ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. దీంతో రాజధాని తదితర ప్రాంతాల్లో ఉన్నవారు సొంతూళ్లకు వస్తున్నారు. ఆర్టీసీలో భద్రాచలం–హైదరాబాద్ టికెట్‌కు సాధారణ రోజుల్లో నాన్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రూ.470, నాన్ ఏసీ సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ. 650, డీలక్స్ రూ. 570గా, ఏసీ రాజధాని రూ.800, లహరీ బస్సులో సిట్టింగ్‌రూ.820, స్లీపర్‌కు రూ.1018 వసూలు చేస్తున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్‌లో..
ప్రైవేటు ట్రావెల్స్‌లో భద్రాచలం–హైదరాబాద్ టికెట్ నాన్ ఏసీ బస్సులో సిట్టింగ్‌కు రూ. 450 తీసుకుంటారు. స్లీపర్ రూ. 650, ఏసీ సర్వీసులకు రూ.819 పైగా వసూలు చేస్తున్నారు. పండుగ సందర్భంగా టికెట్ ధర అమాంతం పెంచారు. నాన్ ఏసీ బస్సులకు స్లీపర్ రూ.1400, సిట్టింగ్ అయితే రూ. 1000, ఏసీ బస్సుల్లో స్లీపర్ రూ. 1400కు పైగా వసూలు చేస్తున్నారు. పండుగ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఇదే చార్జీ వసూలు చేస్తారు.
పట్టించుకోని రవాణాశాఖ
ఇటీవల కాలంలో ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖాధికారులు తనిఖీలు చేయడంలేదు. భద్రాచలం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ఏ ఒక్క ప్రైవేట్ బస్సునూ గోదావరి బ్రిడ్జి పాయింట్‌లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేసిన సందర్భం లేదు. దీంతో పరిమితికి ప్రయాణికులను ఎక్కించడంతోపాటు గంజాయి వంటి నిషేధిత ఉత్పత్తులను కూడా తరలిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తాం. బస్సుల్లో ప్రయాణికులు లగేజీ మాత్రమే తీసుకెళ్లాలి. బస్సులకు సంబంధించిన పర్మిట్, ట్యాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, రవాణాపై దృష్టి సారించి నిబంధనలు అతిక్రమించిన బస్సుల యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం.
–వెంకట పుల్లయ్య, ఎంవీఐ, భద్రాచలం

ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు!