
మద్యం టెండర్లకు రెడీ..
దరఖాస్తులకు రిజర్వేషన్లు ఖరారు
● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ● అక్టోబర్ 18 వరకు గడువు, 23న డ్రా ● ఫీజు గతేడాది కంటే రూ.లక్ష పెంపు
కొత్తగూడెంఅర్బన్: నూతన మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, అదే నెల 23న డ్రా తీస్తారు. టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి మద్యం దుకాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న దుకాణాలకు నవంబర్ 30తో గడువు ముగియనుంది. ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు దరఖాస్తుదారులు అమ్మవారి ఆలయాలు, మండపాల వద్ద పూజలు జరిపించి టెండర్లు వేసే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. అయితే గతేడాది కంటే ఈ సంవత్సరం టెండర్ ఫీజు రూ. లక్ష పెంచడంతో దరఖాస్తుదారులకు అదనపు భారం కానుంది.
జిల్లాలో 88 వైన్స్..
జిల్లాలో ప్రస్తుతం 88 వైన్స్ ఉన్నాయి. 2023లో జరిగిన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియలో రూ.2 లక్షల ఫీజుతో మొత్తం 5,057 దరఖాస్తులను స్వీకరించిన ఎకై ్సజ్ అధికారులు డ్రా పద్ధతిలో 88 మందికి లైస్సెన్స్‌లు జారీ చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచినా పాతవారు మాత్రం పెద్దగా స్పందించడం లేదు.
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..
జిల్లాలో కొత్త మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా కొత్తగూడెంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేటల్లో ఆయా స్టేషన్ల పరిధిలోని వారు ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు అందించేలా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫీజు గతేడాది కంటే రూ.లక్ష పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా.. దరఖాస్తుదారుల సంఖ్య గతం కంటే తగ్గొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా 2027 నవంబర్ 30 వరకు కాలపరిమితి ఉంటుంది.
కొత్త మద్యం దుకాణాల కోసం టెండర్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశాం. స్టేషన్ల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తాం. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం.
–జానయ్య, ఎకై ్సజ్ సూపరింటెండెంట్
జిల్లాలో కొత్త మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో గురువారం లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో ఏ–4 మద్యం దుకాణాలు 88 ఉండగా, 44 షాపులను ఏజెన్సీ ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 44 షాపుల్లో ఎస్సీలకు ఏడు, గౌడ కులస్తులకు ఆరు, జనరల్ వారికి 31 కేటాయించారు.

మద్యం టెండర్లకు రెడీ..