
గజలక్ష్మిగా జగన్మాత
నేడు ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం లక్ష్మీతాయారు అమ్మవారిని.. చెదరని అధికారం, తరగని సంపదను ప్రసాదించే గజలక్ష్మి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించగా మహిళలు భారీగా హాజరయ్యారు. కాగా, చిత్రకూట మండపంలో జరుగుతున్న శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు అయోధ్య కాండ పారాయణం చేశారు.
నేటి ధనలక్ష్మి అలంకార విశిష్టత..
‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం..’ అంటూ శ్రీ సూక్తం అమ్మవారిని ధనలక్ష్మిగా కీర్తిస్తుంది. ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. విద్య, బలం, కీర్తి మొదలైనదంతా ధనమేనని, విద్యాధనం, హిరణ్య ధనం, శక్తి ధనాలను ప్రసాదిస్తుంది కాబట్టే ఈ అమ్మకు ధనలక్ష్మిగా పేరని, ముగ్గరమ్మల శక్తిని భక్తులకు పంచుతుందని పండితులు చెబుతున్నారు.
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

గజలక్ష్మిగా జగన్మాత