
ఎవరికీ పట్టని ఆదివాసీల వ్యథ
ఎంత పోరాడినా పరిష్కారం కాని భూ సమస్య
నాలుగు రోజులుగా ధర్నాచౌక్‌లో రామన్నగూడెం వాసుల నిరాహారదీక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం): అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో 150 మంది ఆదివాసీ రైతులకు సంబంధించిన 573.20 ఎకరాల భూమి విషయంలో అటవీ, ఎఫ్‌డీసీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది. ఉమ్మడి ఏపీగా ఉన్న కాలం నుంచే రైతులు అనేక పోరాటాలు చేసినా భూములు మాత్రం దక్కలేదు. ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇచ్చిందని, ఈ భూమి తమదేనంటూ హైకోర్టు సైతం 2011లో తీర్పు చెప్పిందని, అయినా భూమి మాత్రం తమకు దక్కలేదని ఆదివాసీలు అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గత జూన్ 9న ఆదివాసీలంతా కలిసి మూడురోజుల పాటు రామన్నగూడం నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్రగా వచ్చి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ వారి వద్దకు వచ్చి సమస్యను కలెక్టర్‌కు వివరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అయితే మూడు నెలలు గడిచినా పరిష్కారం కాకపోవడంతో తిరిగి కలెక్టరేట్ పక్కన అధ్వాన స్థితిలో ఉన్న ధర్నాచౌక్ వద్ద శుభ్రం చేసుకుని పిల్లాపాపలతో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఆందోళన గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. అక్కడే వంటావార్పు చేసుకుంటూ, విద్యుత్ సౌకర్యం లేకున్నా టార్చిలైట్ల వెలుతురులో కాలం గడుపుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని ధర్నాచౌక్‌లో ఇబ్బందులు పడుతూ నిరాహారదీక్ష చేస్తున్నా ఆదివాసీల ఆందోళన నాలుగు రోజులుగా బయటి ప్రపంచానికి తెలియలేదు. గురువారం జీఎస్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఆరేం ప్రశాంత్, పాల్వంచ మాజీ ఎంపీపీ మడవి సరస్వతి, ఆదివాసీ నాయకులు సోయం సత్యనారాయణ, సోయం లక్ష్మయ్య, పూనెం నాగేశ్వరరావు వారికి మద్దతు తెలపగా ఈ విషయం వెలుగుచూసింది. కాగా, తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి మడకం నాగేశ్వరరావు స్పష్టం చేశారు.