
నిధుల్లేక నీరసం..
ఏడాదిన్నరగా విడుదల కాని నిధులు
వీధి లైట్లు వేసేందుకూ ఇబ్బందులే
బతుకమ్మ సంబరాల వేళ అంధకారంలో గ్రామాలు
లైట్లు వెలగవు.. బ్లీచింగ్ చల్లరు..
బూర్గంపాడు: గ్రామ పంచాయతీలకు ఏడాదిన్నర కాలంగా నిధులు రాక పల్లెలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలం కావడంతో వీధులన్నీ బురదమయంగా మారాయి. రాత్రి వేళ కనీసం వీధిలైట్లు కూడా వేయలేని పరిస్థితుల్లో గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ప్రస్తుతం బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా రాత్రి అయిందంటే చీకట్లో వెళ్లలేక ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకాలం సొంత డబ్బుతో గ్రామాల్లో పనులు చేయించిన పంచాయతీ కార్యదర్శులు అప్పుల్లో కూరుకుపోయారు. ట్రాక్టర్ల డీజిల్, రిపేర్లు, తాగునీటి సరఫరాలో లైన్ల మరమ్మతులకు కూడా నిధుల కొరత వేధిస్తోంది. వీధుల్లో బురద పేరుకుపోగా బ్లీచింగ్ కొనేందుకు సైతం డబ్బు లేక కార్యదర్శులు ఏ పనీ చేయలేకపోతున్నారు.
పేరుకుపోతున్న చెత్త..
2024 జనవరిలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. నాటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 18 నెలలుగా నిధులు నిలిచిపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై భారం పడుతోంది. పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు అప్పులు చేసి అత్యవసర పనులు చేయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సైతం చేపట్టలేక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ఇక ఇంటి పన్నులు, వార సంతల నిర్వహణ, దుకాణాల అద్దె, ఇతరత్రా వస్తున్న ఆదాయాన్ని పంచాయతీల జనరల్ ఫండ్ ఖాతాలో జమచేయాలి. అయితే జనరల్ ఫండ్ నిధులను ప్రభుత్వం ఫ్రీజింగ్‌లో పెట్టడంతో కార్యదర్శులు కనీసం ఆ డబ్బు కూడా వాడుకునే అవకాశం లేదు. ఫ్రీజింగ్ తొలగించి ఆ నిధులు వాడుకునే అవకాశం కల్పించాలని, తద్వారా కనీస అసవరాలైనా తీర్చొచ్చని కార్యదర్శులు అంటున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే చిన్న పంచాయతీల కార్యదర్శులు రూ.2 లక్షలకు పైగా, పెద్ద పంచాయతీల వారు రూ.6లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పు చేసి వివిధ పనులు చేయించారు. అయితే ప్రస్తుతం తమకు అప్పు ఇచ్చేవారు కూడా లేరని గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపంచాయతీలకు 18 నెలలుగా నిధులు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో నలిగిపోతున్నాం. గ్రామాల్లో ఏ పని చేయాలన్నా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది కార్యదర్శులు సాధ్యమైనంత మేర అప్పులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. జనరల్ ఫండ్‌ను వినియోగించుకోవాలంటే ట్రెజరీలో ఫ్రీజింగ్ నడుస్తోంది.
– కిరణ్, పంచాయతీ కార్యదర్శుల
సంఘం జిల్లా అధ్యక్షుడు
అప్పుల్లో పంచాయతీ కార్యదర్శులు
ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగ వేళ గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. ఆ సమయంలో వీధిలైట్లు వెలగకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. ఇక వర్షాలు పడుతుండగా వీధుల్లో బ్లీచింగ్ చల్లాలి. కానీ బ్లీచింగ్, వీధి లైట్ల కొనుగోలుకు డబ్బులు లేక కార్యదర్శులు సతమతం అవుతున్నారు. స్థానికంగా సోషల్ మీడియా గ్రూప్‌ల్లో వెలగని వీధిలైట్ల ఫొటోలు పెడుతున్న కొందరు పంచాయతీ కార్యదర్శులను నిలదీస్తున్నారు. బతుకమ్మ నిమజ్జనాల కోసం వాగులు, నదులు, చెరువుల వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో ఘాట్‌లు ఏర్పాటు చేయాలి. ఈ పనులన్నింటికీ నిధుల కొరత వేధిస్తుండగా కార్యదర్శులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఈ క్రమంలో వారు కూడా పండుగ ఎలా జరుపుకోవాలంటూ పంచాయతీ కార్యదర్శులనే నిలదీస్తున్నారు.

నిధుల్లేక నీరసం..

నిధుల్లేక నీరసం..