
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాల్సిందే..
బహుజన బతుకమ్మ రాష్ట్ర కన్వీనర్ విమలక్క
పాల్వంచరూరల్: అటవీ సంపదను కొందరికి కట్టబెట్టాలంటే మావోయిస్టులను చంపేస్తే అడ్డు ఉండదనే భావనతో పాలక వర్గాలు చేపడుతున్న ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చలు జరపాలని, అప్పుడే శాంతి నెలకొంటుందని బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ విమలక్క అన్నారు. పాల్వంచ మండలం ఉల్వనూరులో గురువారం నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విమలక్క గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని గిరిజనుల నివాసాలు, గిరిజన అశ్రమ బాలికల పాఠశాల మైదానంలో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతిని విధ్వంసం చేయడమంటే ప్రజలపై యుద్ధం చేయడమేనని తెలిపారు. అలా కాకుండా ప్రకృతి రక్షణే ప్రజల రక్షణగా భావించాలని సూచించారు. బహుజనులు పంచ భూతాలను కాపాడుతుంటే బహుళజాతి కంపెనీలు వాటిని కబళిస్తున్నాయని ఆరోపించారు. వనరుల విధ్వంసం, వివక్షత, ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ ఇక్కడికి కదిలి వచ్చిందని తెలిపారు. బహుళ పంటలతో విలసిల్లాల్సిన తెలంగాణ ఏకపంటల పద్ధతితో వలసలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈమేరకు ప్రకృతికి మూలమైన ఆడబిడ్డలు, దేశ మూలవాసులు ఆదివాసీలతో పాటు అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్‌కౌంటర్లు లేని, ఆదివాసీ బిడ్డలు ఉపిరి పీల్చుకునే, పిల్లల భవిష్యత్ మంచిగా ఉండే తెలంగాణను అంతా కోరుకుంటున్నారని విమలక్క వ్లెడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ, వాసం రుద్ర, మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి