
వరిలో బెరుకులు
ఆందోళనలో రైతులు
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సేద్యం చేసిన వరిపంటలో అధికంగా బెరుకులు కన్పిస్తున్నాయి. రాజాపురం, నామవరం గ్రామాల్లో 200 ఎకరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. బీపీటీ 2782 సాంబ రకం పంటలో బెరుకులు సమస్య నెలకొంది. ఈ క్రమంలో బాధిత రైతులు గురువారం రాజాపురంలో సీడ్ డీలర్ షాపు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి అనూష పంట పొలాలను పరిశీలించారు. సమస్యను జిల్లా అధికారులకు నివేదిస్తామని తెలిపారు.
మిరపనారులో
కలుపు మందు పిచికారీ
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేయడంతో సలీం అనే రైతుకు చెందిన రెండు ఎకరాల మిరప నారు ఛిద్రమైంది. తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో మిరప సాగు చేసేందుకు రైతు మిరపనారు పోసుకున్నాడు. ఇప్పటికే రెండెకరాల్లో మొక్కలు నాటగా, మరో రెండెకరాల్లో నాటేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, ఈ ఘటన జరిగింది. రైతు వ్యవసాయశాఖ, పోలీ సులకు ఫిర్యాదు చేయగా, వ్యవసాయశాఖ అధికారులు మిరపనారును పరిశీలించారు.
జామాయిల్ తోటలో..
అశ్వాపురం: మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన జమలపుడి వెంకటేశ్వర్లు ఎకరం జామాయిల్ తోటకు బుధవారం కొందరు వ్యక్తులు గడ్డిమందు కొట్టడంతో మొక్కలు ఎండిపోయాయి. మూడు నెలల క్రితం మొక్కలు నాటామని, గడ్డిమందు కొట్టడంతో ఎండిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్ల నుంచి భూ తగాదా జరుగుతోందని, ప్రత్యర్థులే గడ్డిమందు కొట్టారని బాధిత రైతు వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నాడు. ప్రతీ ఏటా పొలంలో వేసిన పంటను నాశనం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తునే ఉన్నానని వాపోయాడు.
అట్రాసిటీ కేసులో
డీఎస్పీ విచారణ
సూజాతనగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై గురువారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విచారణ నిర్వహించారు. మండలంలోని నాయకులగూడెం గ్రామానికి చెందిన చల్ల నర్సయ్య, పుల్లమ్మ, చల్ల అచ్చయ్య తమను కులం పేరుతో దూషించారని అదే గ్రామంలోని లెనిన్‌నగర్‌కు చెందిన దళితమహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో డీఎస్పీ వచ్చి విచారణ చేపట్టారు. బాధిత మహిళలతోపాటు దూషించిన వారిని విచారించారు. డీఎస్పీ వెంట చుంచుపల్లి సీఐ ఆర్.వెంకటేశ్వర్లు, సుజాతనగర్ ఎసై రమాదేవి ఉన్నారు.

వరిలో బెరుకులు

వరిలో బెరుకులు