
కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మ పూజ చేశారు. మహిళా ఉద్యోగులతో కలిసి వివిధ రకాల తామర పుష్పాలు, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు. సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ అడారు.
విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు జి.జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించరాదని, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీఎంఏటీ, పీటీఈలలో ఏదో ఒక పరీక్షలో అర్హత సాధించి ఉండాలని, తప్పనిసరిగా పాస్ పోర్ట్ కలిగి ఉండాలని, గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం పొంది ఉండాలని వివరించారు.
అన్నం శ్రీనివాసరావుకు అవార్డు
ఖమ్మం అర్బన్ : హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన అచీవ్‌మెంట్ అవార్డు–2025 కార్యక్రమంలో జిల్లాకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నం శ్రీని వాసరావుకు పురస్కారం దక్కింది. ఈ మేరకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పోతుగంటి వెంకటేశ్వర్లు, గంధం పట్టాభి రామారావు, షేక్ నాగుల్‌మీరా, కేశవపట్నం శ్రీనివాస్, కడవెండి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబరాలు