
‘పేట’కే అదనంగా ఇళ్లు ఇచ్చాం
ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక
ప్రజా ప్రభుత్వంలో 11లక్షల రేషన్ కార్డులు పంపిణీ
మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి
అశ్వారావుపేటరూరల్: రాష్ట్రంలో అశ్వారావుపేట నియోజకవర్గానికే అదనంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఇది స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పనితీరుకు నిదర్శమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం అశ్వారావుపేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా ఎన్నికై న సుంకవల్లి వీరభద్రరావు, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారం అనుభవించి రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఈ ఇళ్లు పేదలకు భరోసా, భద్రతతోపాటు ఆత్మ గౌరవానికి ప్రతీకలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీ ప్రకారం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తొలి విడతగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇస్తే అశ్వారావుపేటకు అదనంగా మరో 1000 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. రాష్ట్రంలో 11 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగా, మరో 7 లక్షల కార్డుల్లో కుటుంబీకుల పేర్ల నమోదుకు అవకాశం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, పేదల సొంతింటి కల సాకారం చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అశ్వారావుపేట నియోజకవర్గం ప్రత్యేకమని, హైదారాబాద్‌లో చాక్లెట్ కంపెనీకి అశ్వారావుపేటలో సాగు చేస్తున్న కోకో పంటను వినియోగిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని చాక్లెట్ తయారీదారులే తనకు చెప్పారని, ఇది జిల్లాకే గర్వకారణమని అన్నారు. చేపల పెంపకానికి 500 యూనిట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆసక్తి ఉన్న వారు అధికారులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఆర్‌డీఓ మధు, జిల్లా వ్యవసాయాఽధికారి బాబురావు, ఆత్మ కమిటీ డీపీడీ సరిత, మున్సిపల్ కమిషనర్ బి. నాగరాజు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.