
‘ఎకో’ ఏమాయె..?
కలెక్టర్ కొంతమేర ప్రయత్నించినా..
అటవీ విస్తీర్ణంలో భద్రాద్రికి రెండో స్థానం
ఏజెన్సీ ప్రాంతాలకు ఆదరణ కరువు
పట్టించుకోని గిరిజన ప్రజాప్రతినిధులు
భద్రాచలం: ప్రకృతి అందాలు.. పచ్చని అడవులకు నెలవై ఉన్న భద్రాద్రి జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంది. అడవుల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఎకో టూరిజం ప్రాజెక్టులో జిల్లాకు చోటు దక్కలేదు. ఎకో టూరిజంతో జిల్లా, గిరిజనుల అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, మంత్రులు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అబ్బురపరిచే అటవీ అందాలు..
రాష్ట్ర విభజనకు ముందు అటవీ విస్తీర్ణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2021 ప్రభుత్వ లెక్కల ప్రకారం 21,214 చదరపు కిలోమీటర్ల మేర అడవులతో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతం, సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కిన్నెరసాని, మూసి, పాములేరు వంటి చిన్నచిన్న ఉపనదులు, దుమ్ముగూడెం, మూకమామిడి తదితర సాగునీటి ప్రాజెక్టులతో పాటు అభయారణ్యం ఉన్నాయి. అన్నింటికీ మించి దేశవ్యాప్తంగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉంది. ఇలా అటవీ, ప్రకృతి, నదీ తీర అందాలతో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ ఎకో టూరిజంలో చోటు దక్కకపోవడం శోచనీయమని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు పట్టింపేది..?
జిల్లాలోని అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు గిరిజన ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. మొత్తంగా ఐదుగురు గిరిజన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ జిల్లాకు, గిరిజన యువతకు, ఏజెన్సీ ప్రాంతానికి వన్నె తెచ్చే ఎకో టూరిజంలో ఒక్క ప్రాజెక్టును సైతం మంజూరు చేయించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అటవీ, ప్రకృతి అందాలు, టూరిజం అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా వాసులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కేబినెట్‌లో కీలక శాఖల్లో ఉన్నారని, వారికి అనుచరులుగా పేరొందిన ఆయా ఎమ్మెల్యేలు ఎకో ప్రాజెక్ట్‌ల అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లలేకపోయారని విమర్శిస్తున్నారు.
కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎకో టూరిజం అవశ్యకతను గుర్తించారు. ఏరు ఉత్సవం పేరిట భద్రాచలం గోదావరి ఒడ్డున, జీడిగుప్పతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివాసీ హట్స్ ఏర్పాటు చేశారు. అయితే వాటికి ఏడాది పాటు తగిన ఆదరణ, ప్రచారం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కిన్నెరసానిలో సైతం ఎకో టూరిజం అభివృద్ధికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీతారామ, దుమ్ముగూడెం ఆనకట్ట తదితర ప్రాంతాల్లో తీగల వంతెన, కాటేజీలు నిర్మించాలని, ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు చొరవ చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
పర్యావరణ పర్యాటకంలో జిల్లాకు దక్కని చోటు

‘ఎకో’ ఏమాయె..?