
శరవేగంగా రిటైనింగ్ వాల్
మంత్రుల పర్యవేక్షణలో..
● పనుల ప్రగతిపై మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యవేక్షణ ● వరంగల్ ఎన్‌ఐటీ నిపుణులతో నాణ్యతా పరీక్షలు ● భూసేకరణ ప్రక్రియ వేగవంతం ● ఇరువైపులా సర్వీస్ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ
సాక్షిప్రతినిధి, ఖమ్మం : మున్నేరుకు వరద వస్తే పరీవాహకంలోని ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో మున్నేరు ప్రభావంతో అనేక కాలనీలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.525.36 కోట్ల వ్యయంతో మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత రెండేళ్లుగా క్లౌడ్ బరస్ట్‌తో వస్తున్న వరదలతో మున్నేటి పరీవాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రతి ఏటా నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే వారు ఊపిరి పీల్చుకుంటారు.
తీరని నష్టం..
గత రెండేళ్లుగా మున్నేరుకు వచ్చిన వరదలతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. రోజువారీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక రోడ్లు, విద్యుత్ స్తంభాలు, సబ్ స్టేషన్లు, పాఠశాల భవనాలు, పైపు లైన్లు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో సంభవించిన క్లౌడ్ బరస్ట్‌తో మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరదతో ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు రూ. 757 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్నేరుకు రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.525 కోట్లతో..
నగరం మధ్య నుంచి మున్నేరు వాగు ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతం, నగరం నుంచి వచ్చే వరద గరిష్ట స్థాయిని దృష్టిలో ఉంచుకుని మున్నేరు వాగుకు రెండు వైపులా సిమెంట్ కాంక్రీట్‌తో రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం రూ.525.36 కోట్లు మంజూరు చేయగా నిర్మాణ పనులను ప్రారంభించారు. మున్నేరు వాగుకు రెండు వైపులా ఖమ్మం రూరల్ మండలంలో 8.5 కిలోమీటర్లు, ఖమ్మం అర్బన్ మండలంలో 8.5 కిలోమీటర్లు.. మొత్తం 17 కిలోమీటర్లు పొడవునా 10 నుంచి 15 మీటర్ల ఎత్తుతో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతోంది. ఇక సర్వీసు రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థ సదుపాయంతో ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండగా వరంగల్ ఎన్‌ఐటీ నిపుణులతో తనిఖీ చేయిస్తోంది.
రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలంలో మల్లెమడుగు, దానవాయిగూడెం, బుర్హాన్ పురం, ఖమ్మం, రూరల్ మండలం పోలేపల్లి, గోళ్లపాడు, గుదిమల్ల, గుర్రాలపాడు, ఏదులాపురం గ్రామాలకు చెందిన మొత్తం 245.12 ఎకరాల భూసేకరణలో 106.21 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 138.31 ఎకరాల పట్టా భూమిలో ఇప్పటివరకు 69.12 ఎకరాల సేకరణ పూర్తయింది. భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. నిర్వాసితులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 139.27 ఎకరాల్లో లేఔట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందులో 1,666 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు. అన్ని మౌలిక వసతులతో మోడల్ కాలనీగా ఇది అభివృద్ధి చెందనుంది.