
గెలల తరుగులో వివక్ష ?
నిబంధనలేవీ?
● ఒక్కో రైతుకు ఒక్కోలా నిర్ణయం ● ఆయిల్‌ఫెడ్ అధికారుల తీరుపై విమర్శలు
అశ్వారావుపేట: అధిక వర్షాలకు ఆయిల్‌పామ్ గెలల దిగుబడి పెరగడంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు తరుగు తీయడంలోనూ వివక్ష చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ వద్ద మల్లారెడ్డి రమణమూర్తి అనే రైతు తనకు ఎక్కువ తరుగు తీశారని ఆరోపిస్తూ గత సోమవారం ఫ్యాక్టరీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పలువురు రైతులు, ఆయిల్‌ఫెడ్ అధికారులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆయిల్‌ఫెడ్‌లో గెలలను స్క్రీనింగ్ చేసే పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది. మలేషియా వంటి దేశాల్లో ఆయిల్‌పామ్ ఉత్పత్తి అధికంగా ఉన్నా.. వేలాది టన్నుల గెలలు వచ్చినా.. స్క్రీనింగ్ పటిష్టంగా ఉంటుందని, కానీ ఇక్కడ క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడం, ఫ్యాక్టరీలో స్క్రీనింగ్ సమయం, విశాలమైన ప్లాట్‌ఫాం లేకపోవడంతో ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం లభిస్తోందని చెబుతున్నారు. ఫ్యాక్టరీకి గెలలను తెచ్చే వారికి ఉండే పలుకుబడిని బట్టి అధికారులు వివక్ష చూపుతూ తరుగు తీస్తున్నారని కొందరు రైతులు వాపోతున్నారు. అసలు తరుగును నిర్ణయించేందుకు నిర్ధిష్ట ఫార్ములా ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
నరికేటప్పుడు జాగ్రత్త పడితే..
సన్న, చిన్నకారు రైతులు మాత్రమే క్షేత్రాలకు వెళ్లి గెలల కటింగ్‌ను దగ్గరుండి చేయిస్తుంటారు. పదెకరాలకు మించి సాగు చేసే రైతులు, పదుల ఎకరాల్లో కౌలుకు తీసుకునే రైతులు అన్ని క్షేత్రాల్లో ఒకే సారి గెలలను ముఠా ద్వారా నరికిస్తుంటారు. యజమాని అందుబాటులో లేని చోట్ల గెలల నరికివేతలో వ్యత్యాసాలు వస్తుంటాయి. ముఠాకు టన్నుల చొప్పున నగదు చెల్లిస్తున్నందున అధిక బరువు వచ్చేలా వ్యవహరించడం ఓ కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. తరుగు తీసే విషయమై అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల మేనేజర్లు నాగబాబు, కళ్యాణ్‌ను వివరణ కోరగా.. రైతుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదని, డ్రైవర్లు, రైతులకు గెలలను చూపించిన తర్వాతే తిరస్కరిస్తున్నామని తెలిపారు. పనికిరాని గెలలను అనుమతిస్తే అంతిమంగా రైతులతోపాటు ఫెడరేషన్ మనుగడకు ముప్పు ఉంటుందని చెప్పారు.
ఆయిల్‌పామ్ గెలల్లో తరుగుకు నిర్ధిష్టమైన నిబంధనలేమీ ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సీజన్ కాబట్టి కంటి చూపుతో ఓ అంచనా ప్రకారం గెలల తేడాను బట్టి తరుగు విధిస్తుంటారు. ఓ ట్రాక్టర్‌కు 5టన్నుల గెలలు వస్తే అత్యధికంగా 50 కిలోలు తరుగు రాస్తారు. చాలా తక్కువ సందర్భాల్లో 70 కిలోలు రాస్తుంటారు. పైకి 1శాతం అయినా రైతుకు జరిగే నష్టం రూ.వెయ్యి. అందుకే రైతుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా కాకుండా సరాసరి తరుగు అందరికీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.