
భద్రగిరిపై నిర్లక్ష్యమేలా?
మేడారం, వేములవాడపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి భద్రాచలం అభివృద్ధి పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం రామాలయ మాస్టర్ ప్లాన్‌పై కదలిక శూన్యం! 2027లో జరిగే గోదావరి పుష్కరాలపైనా అదే తీరు
భద్రాచలం: గిరిజన కుంభమేళాగా భావించే సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే మేడారంలో అభివృద్ధి పనులకు ముహుర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా పనులు ప్రారంభించనున్నారు. రాజన్న కొలువై ఉన్న వేములవాడలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. భద్రగిరి రామయ్య దేవస్థాన అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. రోజులు గడుస్తున్నా తుది మాస్టర్ ప్లాన్ సిద్ధం కాలేదు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే పనులు పట్టాలెక్కడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం ఎప్పుడో..?
రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లను ప్రకటించి, పనులు చేపడుతోంది. 2026, జనవరిలో జరిగే మేడారం జాతరకు గద్దెల ఆధునికీకరణ, ఇతర అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయటంతోపాటు త్వరలోనే ముఖ్యమంత్రి పనులను ప్రారంభించనున్నారు. కానీ భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం మాస్టర్ ప్లాన్, నిధుల విడుదల మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇటీవల ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి కలెక్టర్, వైదిక కమిటీ, దేవస్థాన అఽధికారులతో భద్రాచలంలో ఆలయాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కూడా కూడా ప్లాన్‌పై స్పష్టత రాలేదు. రూ.350 కోట్లతో దేవస్థానం అభివృద్ధి చేపట్టాలని దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినా ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు.
పుష్కరాల పనుల ఊసేలేదు..
పన్నెండేళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాలు మళ్లీ 2027 ఆగస్టులో జరగనున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో భద్రాచలం రామాలయానికి భక్తుల రద్దీ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంటుంది. కోటి మందికి పైగా భక్తులు ఈ సారి పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన ప్రణాళికలపై ఇంతవరకు ముందస్తు చర్యలు చేపట్టలేదు. స్నానఘాట్ల సంఖ్య పెంపు, అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, రోడ్ల విస్తరణ, భక్తులకు సర్వ దర్శనం, వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు తదితర అంశాలపై ముందస్తు మ్యాప్‌లను సిద్ధం చేయాలి. తగిన అంచనాలతో బడ్జెట్ రూపొందించాలి. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గత పుష్కరాల్లో పని చేసిన సీనియర్ ఐఏఎస్, ఇతర శాఖల అధికారుల సలహాలు, సూచనలతో పటిష్ట ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఇవేమీ ప్రారంభం కాలేదు.
ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనం
ప్లాన్ రూపకల్పన, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, విడుదలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రసాద్ పథకం పనులు ఆశించినంత వేగంగా జరగటం లేదు. ఈ నేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని భక్తులు కోరుతున్నారు. రామాలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు నిధులను విడుదల చేయాలని వేడుకుంటున్నారు.