
ఘనంగా వేంకటేశ్వర కల్యాణం
అన్నపురెడ్డిపల్లి, (చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసిఉన్న శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం శనివారం వైభవోపేతంగా నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి క్రతువు జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. పూజాది కార్యక్రమాలను దేవస్థానం ప్రధాన పూజారి ప్రసాదాచార్యులు నిర్వహించగా, కల్యాణ ఏర్పాట్లను ఆలయ మేనేజర్ టీవీ రమణ పర్యవేక్షించారు.
కిన్నెరసాని గేటు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలయాశానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 600 క్యూసెక్కుల వరదనీరు రావడంతో శనివారం నీటిమట్టం 406.20 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
23న దసరా అడ్వాన్స్
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 23న కార్మికులకు దసరా అడ్వాన్స్ చెల్లించనున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. పండుగ సందర్భంగా కార్మికులకు రూ.25 వేల అడ్వాన్స్ ఇచ్చి, పది సమాన వాయిదాల్లో రికవరీ చేస్తామని తెలిపింది . నగదును 23న బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొంది.
సింగరేణి అధికారుల బదిలీ
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి మైనింగ్ విభాగంలో 31 మంది అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సెల్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. బదిలీఅయిన వారిలో ఏజీఎం మొదలు కొని మేనేజర్‌స్థాయి వరకు ఉన్నారు. ఈనెల 27వ తేదీలోగా కేటాయించిన స్థానాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పశువులు తరలిస్తున్న వాహనాల పట్టివేత
చండ్రుగొండ: మూడు బొలేరో వాహనాల్లో అక్రమంగా పశువులను తరలిస్తుండగా మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ శివరామకృష్ణ ఆద్వర్యంలో జాతీయ రహదారిపై పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఐదు ఆవులు, మూడు కోడె దూడలను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తుల నుంచి ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశువులను పాల్వంచలోని గోశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సుజాతనగర్: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సుజాతనగర్ ఎస్‌ఐ ఎం.రమాదేవి శనివారం పట్టుకున్నారు. బేతంపూడి శివారులో అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు రెండు ట్రాక్టర్లను పట్టుకొని కుంజా జీవన్, జబ్బ విజేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
సుజాతనగర్: రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం పట్టుకున్నారు. జూలూరుపాడు మండలానికి చెందిన కొమ్మి నేని నాగేశ్వరరావు స్థానిక భవాని రైస్ మిల్లు ఎదురుగా 7 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో రవాణా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బియ్యం నిల్వలను సీజ్ చేశారు. నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.రమాదేవి తెలిపారు.
పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం
ఇల్లెందురూరల్: మండలంలోని మాణిక్యారం గ్రామ పంచాయతీ దేశ్యాతండాకు చెందిన బానోత్ రాంజీ మద్యం మత్తులో శనివారం పురుగులమందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఖమ్మంకు సిఫార్సు చేయగా.. కుటుంబ సభ్యులు తరలించారు.

ఘనంగా వేంకటేశ్వర కల్యాణం

ఘనంగా వేంకటేశ్వర కల్యాణం