● తొలుత మరోపాప జననం ● నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువగా ఉండటంతో ఖమ్మానికి తరలింపు
ఇల్లెందు: అంబులెన్స్‌లో గర్భిణి ఓ పాపకు జన్మనిచ్చిన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. అంతకు కొద్ది సమయం ముందే ఓ పాప పుట్టింది. ఈ ఇద్దరూ 7వ నెలలో పుట్టడం, బరువు తక్కువగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఈర్యాతండాకు చెందిన డి.రాజేశ్, అదే పంచాయతీ చింతలపాడుకు చెందిన ఎస్.సంధ్యశ్రీ ఏడాది కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. సంధ్యశ్రీ ఏడు నెలల కిందట గర్భం దాల్చింది. అయితే, నెలలు నిండకుండానే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోగానే ఓ పాప పుట్టింది. మరోపాప అంబులెన్స్‌లో జన్మించింది. ఇద్దరు శిశువులు, తల్లి సంధ్యను ఇల్లెందుకు ఆస్పత్రికి తలరించగా.. గైనకాలజిస్ట్ సోనిక పరీక్షించి.. మొదటి పాప కిలోన్నర, రెండో పాప 800 గ్రాముల బరువు ఉండటంతో ఖమ్మానికి తరలించాలని సూచించారు. 108 ఈఎంటీ రేణుకదేవి, పైలట్ వేణుకుమార్ వారిని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.