
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
ఖమ్మంరూరల్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం సీసీఎస్, ఖమ్మంరూరల్, రఘునాథపాలెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వివరాలు వెల్లడించారు. రఘునాథపాలెం మండలం రేగులచెలక గ్రామానికి చెందిన జంగా వెంకన్న, వెల్లబోయిన లక్ష్మణ్‌రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎదురుగడ్డ ప్రాంతానికి చెందిన వల్లపు సంపత్ కలిసి ఓ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. సీసీఎస్, సివిల్ పోలీసులు సంయుక్తంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఖమ్మంరూరల్ మండలం కామంచికల్, గొల్లగూడెం, మద్దులపల్లి, నేలకొండపల్లి, ఖానాపురం, కల్లూరు, రఘునాథపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి 190 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.20 లక్షలు ఉంటుందని ఏసీపీ వివరించారు. రూరల్ సీఐ రాజు ఎస్‌ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
బంగారు ఆభరణాలు స్వాధీనం