సాగులో సరికొత్తగా.. | - | Sakshi
Sakshi News home page

సాగులో సరికొత్తగా..

Sep 21 2025 1:17 AM | Updated on Sep 21 2025 1:17 AM

సాగుల

సాగులో సరికొత్తగా..

రోజూ 40 ఎకరాల్లో పిచికారీ..

పత్తి పంటలో ట్రాక్టర్లతో

పురుగుమందుల పిచికారీ

కూలీల కొరతను అధిగమిస్తున్న రైతులు

సకాలంలో మందులు స్ప్రే చేసేందుకు అవకాశం

మనుషులపై తగ్గనున్న

రసాయనాల ప్రభావం

సకాలంలో మందులు కొడుతున్నాం

కూలీలతో ఇబ్బందులు పడలేక..

రైతులు పంటల సాగులో నూతన ఒరవడి అవలంబిస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు, సకాలంలో పురుగుమందుల పిచికారీకి ట్రాక్టర్‌ స్ప్రేయర్లు వినియోగిస్తున్నారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందు పిచికారీ చేయగలుగుతున్నారు. ఫెస్టిసైడ్స్‌ కంపెనీలు సూచించిన పరిమాణంలో రసాయన మందులకు నీటిని కలిపి పంట చేలలో పిచికారీ చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. – బూర్గంపాడు

పత్తి చేలో ట్రాక్టర్‌ స్ప్రేయర్‌తో పురుగులమందు పిచికారీ చేస్తున్న రైతు

రెండేళ్లుగా పెరుగుతున్న వినియోగం

జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. ఈసారి సుమారు 2.20 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. పత్తిని ఆశించే పురుగు, చీడపీడల, దోమ నివారణకు కనీసం ఎనిమిది నుంచి పదిసార్లు మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. కూలీల కొరత కారణంగా రైతులు సకాలంలో పురుగుమందులు స్ప్రే చేయలేకపోతున్నారు. దీనికితోడు స్ప్రే చేసిన కూలీలపై అప్పుడప్పుడు రసాయనాల ప్రభావం కూడా పడుతోంది. పలువురు కూలీలు అస్వస్థతకు గురైన, అక్కడక్కడా ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు రైతులు కొత్త పద్ధతులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్‌కు స్ప్రేయర్లు బిగించి పత్తిలో మందులు పిచికారీ చేస్తున్నారు. ఐదారేళ్ల క్రితం నుంచి ట్రాక్టర్‌ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నా, రెండేళ్లుగా వీటి వినియోగంగా బాగా పెరిగింది. జిల్లాలో ఈ ఏడాది చాలా గ్రామాల్లో రైతులు ట్రాక్టర్‌ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. పురుగు, తెగుళ్లు, దోమ ఉధృతిని గుర్తించగానే మందులు సకాలంలో పిచికారీ చేసుకుంటున్నారు. గతంలో కూలీలు దొరికేవరకు ఆలస్యమైతే పంట నష్టం జరిగేది. ఇప్పుడా ఆందోళన లేదు.

నిర్దేశిత మోతాదులో..

ఫెస్టిసైడ్స్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను పంటలపై పిచికారీ చేసేటప్పుడు సూచించే పరిమాణంలో రైతులు నీటిని వినియోగించలేకపోతున్నారు. నీటి మోతాదు తక్కువ అవుతుండటంతో మొక్కలు పూర్తిగా తడవటం లేదు. అదే ట్రాక్టర్‌ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తే కంపెనీలు సూచించిన మోతాదు నీటిని కలిపి మొక్కలు పూర్తిస్థాయిలో తడుపుతున్నారు. దీంతో పురుగు, దోమ, తెగుళ్ల ఉధృతిని కట్టడి చేయగలుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కూలీల అవసరం లేకుండా టాక్టర్‌ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు.

ట్రాక్టర్‌ స్ప్రేయర్‌తో రోజూ 40 ఎకరాల వరకు పత్తికి మందులు పిచికారీ చేస్తున్నారు. అదే పని ని కూలీలతో చేస్తే నాలుగు రోజులు పడుతుంది. కూలీల ఖర్చు తగ్గటంతోపాటు సమ యం కలిసివస్తుంది. దీంతో రైతులు ట్రాక్టర్‌ స్ప్రేయర్లపై మక్కువ చూపుతున్నారు. ట్రాక్టర్‌కు స్ప్రేయర్‌ను బిగించుకునేందుకు రూ.70వేల వరకు ఖర్చవుతుంది. కూలీల ఖర్చులతో పోల్చుకుంటే రైతులకు ఎకరాకు రూ. 8వేల వరకు ఆదా అవుతుంది. జిల్లాలోని బూర్గంపాడు, అశ్వాపురం, దు మ్ముగూడెం, గుండాల, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లో రైతులు ప్రస్తుతం ట్రాక్టర్‌ స్ప్రేయర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌ స్ప్రేయర్లు కొనలేని రైతులు కిరాయి ఇచ్చి మందులు పిచికారీ చేయిస్తున్నారు. ఎకరాకు రూ. 150 నుంచి రూ.200 వరకు కిరాయి వసూలు చేస్తున్నారు. ఇద్దరు కూలీలతో రోజుకు ఆరు, ఏడు ఎకరాల వరకు మందు పిచికారీ చేయవచ్చు. వారికి కూలి రూ.1500, స్ప్రేయర్‌ పెట్రోలుకు రూ. 300, మొత్తం రూ. 1800 ఖర్చవుతుంది. అదే ట్రాక్టర్‌తో స్ప్రే చేస్తే ఆరు, ఏడు ఎకరా లకు రూ.1000 మాత్రమే ఖర్చు వస్తుంది. మందు పిచికారీ కూడా గంటన్నరలో పూర్తవుతుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్రాక్టర్‌ స్ప్రేయర్లతో తొందరగా మందుల పిచికారీ జరుగుతోంది.

ట్రాక్టర్‌ స్ప్రేయర్‌తో మందులు సకాలంలో కొట్టగలుగుతున్నాం. చేలో పురుగు ఉందంటే వెంటనే ట్రాక్టర్‌తో వెళ్లి మందులు కొడుతున్నాం. అదే కూలీలతో చేయించాలంటే వారు దొరకక ఇబ్బందులు పడాలి. ఖర్చు కూడా సగానికి సగం తగ్గుతుంది.

–యడమకంటి రవీందర్‌రెడ్డి, రైతు, రెడ్డిపాలెం

పత్తిచేలలో మందులు కొట్టేందుకు కూలీలు దొరకటం లేదు. స్థానికంగా దొరకకపోవటంతో ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలన వచ్చిన కూలీలతో మందులు కొట్టించుకోవాల్సి వస్తుంది. వారికి మందులు కొట్టడం పెద్దగా తెలియదు. ఈ ఇబ్బందులు పడలేక ట్రాక్టర్‌ స్ప్రేయర్లతో మందులు కొట్టిస్తున్నాం.

–పాలం లక్ష్మిరెడ్డి, రైతు, నాగినేనిప్రోలు

సాగులో సరికొత్తగా..1
1/3

సాగులో సరికొత్తగా..

సాగులో సరికొత్తగా..2
2/3

సాగులో సరికొత్తగా..

సాగులో సరికొత్తగా..3
3/3

సాగులో సరికొత్తగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement