
వయోజన విద్యకు సిద్ధం
షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నాం..
● జిల్లాలో 38,301 మంది నిరక్షరాస్యుల గుర్తింపు ● 964 మంది ఆర్‌పీలు, 3,831 మంది వలంటీర్లకు శిక్షణ ● త్వరలో గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించనున్న అధికారులు
ఇల్లెందు: పదేళ్లుగా అటకెక్కిన వయోజన విద్యాబోధనను మళ్లీ ప్రారంభించనున్నారు. నిరక్షరాస్యులను గుర్తించి అక్షరజ్ఞానం కల్పించనున్నారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్లు, ఆర్పీలు, డీఆర్పీలకు శిక్షణ పూర్తిచేశారు. త్వరలోనే గ్రామాల్లో విద్యా కేంద్రాలను ప్రారంభించి గుర్తించిన వయోజనులకు బోధన చేపట్టనున్నారు.
964 పాఠశాలల ఎంపిక
జిల్లాలో 22మండలాల్లో 964 పాఠశాలల్లో వయో జన విద్య కార్యక్రమం అమలు చేయనున్నారు. జిల్లాస్థాయిలో డీఆర్‌పీలకు, మండల స్థాయిలో 964మంది ఆర్‌పీలు, గ్రామస్థాయిలో 3,831మంది వలంటీర్లకు శిక్షణ పూర్తి చేశా రు. బోధనకోసం వలంటీర్లకు మార్గదర్శిని అనే పుస్తకాలు కూడా అందించారు. జిల్లాలో నిరక్షరాస్యులైన వయోజనులు 38,301 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరికి విద్య నేర్పేందుకు వయోజన విద్య కార్యక్రమం అమలు కోసం ఒక్కో మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులను, మండల రిసోర్స్ పర్సన్స్ ఎంపిక చేశారు. గ్రామస్థాయిలో డ్వాక్రా గ్రూపు సభ్యుల సహకారం కూడా తీసుకోనున్నారు. వయోజనుల కోసం 38,301 అక్షర వికాసం అనే పుస్తకాలు, బ్రోచర్లు కూడా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి.
రోజూ గంటన్నరపాటు
వలంటీర్లు రోజూ సాయంత్రం గంటన్నరపాటు వయోజనులకు బోధించాల్సి ఉంటుంది. మూడు నెలల్లో కేటాయించిన వాచకాలను బోధించి వ యోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సి ఉంది.ఇందుకోసం వలంటీర్‌కు పారితోషికం కూడా చెల్లిస్తారు. శిక్షణ కాలంలో వలంటీర్లకు టీ, స్నా క్స్, భోజనవసతి వంటి సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఆతర్వాత మూల్యాంకనంచేసి వయో జనులు ఏ మేరకు విద్య నేర్చుకున్నారో అంచనా వేయాల్సి ఉంటుంది. వయోజన బోధనకోసం మూడంచెల పద్ధతి అనుసరిస్తున్నారు. తొలి విడతలో మార్గదర్శిని, అక్షర వికాస్ ద్వారా బోధించాలి. దీనినే అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్)గా పే ర్కొంటున్నారు. నవభారత్ సాక్షరతా కార్యక్రమం లో ‘చదువుకుందాం రండి.. చదువు నేర్పుదాం పదండి’అంటూ శిక్షణ మాన్యువల్‌లో సూచించారు.
పనుల కాలంలో బోధన సాగేనా?
ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతున్న, యూరియా దొరకక రైతులు అల్లాడుతున్న తరుణంలో వయోజన విద్యా కార్యక్రమం ముందుకు సాగేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిర్వహించిన అక్షరదీపం తరహాలో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగితేనే ప్రతిఫలాలు లభిస్తాయని పలువురు పేర్కొంటున్నారు.
వయోజన విద్య ప్రారంభానికి శిక్షణ పూర్తయింది. గ్రామాల వారీగా నిరక్షరాస్యులైన వయోజనులల వివరాలు సేకరించి వలంటీర్లను నియమించారు. కేంద్రాలు ప్రారంభించి బోధన చేపట్టాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నాం.
– మిడియం దుర్గారావు,
మండల పర్యవేక్షకుడు, ఇల్లెందు

వయోజన విద్యకు సిద్ధం