
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్ల కీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయఅర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామయ్య సేవలో మాజీ క్రికెటర్ లక్ష్మణ్
శ్రీసీతారామ చంద్ర స్వామివారిని శనివారం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. తరువాత దేవస్థాన అనుబంధ ఆలయాలను సందర్శించగా అధికారులు ఆయనకు స్వామి వారి జ్ఞాపికతో పాటు ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పీఆర్వో సాయిబాబు, వేదపండితులు పాల్గొన్నారు.
వైభవంగా రుద్రహోమం
పాల్వంచరూరల్: మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం అమ్మవారి సన్నిధిలోని యాగశాలలో రుద్రహోమం జరిపారు. ముందుగా మేళతాళాలతో, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ రుద్రహోమం చేశారు. చివరన పూర్ణాహుతి నిర్వహించారు.
డీఈపై ఈఎన్‌సీ ఆగ్రహం
అశ్వారావుపేట: ఆర్‌అండ్‌బీ డీఈ ప్రకాశ్‌పై ఆ శాఖ ఈఎన్‌సీ మోహన్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేటలో ఏళ్ల తరబడి నిర్మిస్తున్న రహదారి విస్తరణ పనులను శనివారం రాత్రి ఆయన పరిశీ లించారు. రహదారిపై డివైడర్ వంపు కనిపించడం లేదా అని మందలించారు. రింగ్ సెంటర్‌లో బయటివైపు రోడ్డు వాలి నిర్మించడం వల్ల వాహనాలు పడిపోతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం రోడ్‌లో కిలోమీటరు రహదారి విస్తరణ పనులు ఎంతకాలం చేస్తారని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. బీటీ రహదారిని నిర్మించాకే సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఇతర పనులు చేపట్టాలని సూచించారు. రహదారి నిర్మాణంలో లోపం వల్లే రింగ్ సెంటర్‌లో ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్లే వాహనాలు పల్టీ కొడుతున్నాయని అన్నారు. అత్యవసరంగా రింగ్‌లో సాంకేతిక లోపాన్ని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీపావళి నాటికి బీటీ పూర్తిచేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించామన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా
ఉషూ జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా పాఠశాలలు, జూనియర్ కళాశాలల క్రీడా సంఘాల సంయుక్త ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లాస్థాయి బాలబాలికల అండర్–17, 19 ఉషూ జట్ల ఎంపిక పోటీలు సోమవారం నిర్వహిస్తున్నట్లు సంఘాల బాధ్యులు పి.వెంకటేశ్వర్లు, నరేష్‌కుమార్, ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అండర్–17 విభాగంలో బాలబాలికలు 2009 జనవరి తర్వాత, అండర్–19 విభాగంలో 2007 జనవరి తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. క్రీడాకారులు వయసు ధ్రువపత్రాలతో పాటు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ తీసుకురావాలని, వివరాలకు 99481 99743, 98662 90609 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

రామయ్యకు సువర్ణ తులసీ అర్చన