
సకాలంలో రుణాలు ఇవ్వాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): సకాలంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి జిల్లాలోని బ్యాంకర్లు, ఇతర అధికారులతో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్ష నిర్వహించారు. రైతుల రుణాల పంపిణీ, స్వశక్తి సంఘాల రుణాల రికవరీ, పీఎం స్వానిధి రుణాలు, ఎఫ్‌పీఓల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం రూ. 2,291 కోట్ల పంట రుణాల లక్ష్యానికి సెప్టెంబర్ చివరివరకు రూ.409.55 కోట్లు, రూ.1,416.09 కోట్ల వ్యసాయ టర్మ్ రుణాల లక్ష్యానికి రూ.342.31 కోట్ల రుణాలు అందించామని వివరించారు. తక్కువ పంట రుణాలు అందించిన బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న మూడు నెలల కాలంలో 500 యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు సహకరించాలని ఆదేశించారు.
బాధితులకు న్యాయం చేయాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు.
పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి
జిల్లాలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించే పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో నిర్వహించే సురక్షత, పోషణ, ఆరోగ్యం కార్యక్రమంపై సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎల్‌బీఎం రామ్‌రెడ్డి, మెప్మా పీడీ రాజేష్, నాగలక్ష్మి, స్వర్ణలత లెనీనా, జయలక్ష్మి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకర్ల సమావేశంలో
కలెక్టర్ జితేష్ వి పాటిల్