భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఏఎంఆర్‌తో పారదర్శకత
విద్యుత్ ఎస్‌ఈ మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): హెచ్‌టీ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు అందజేయడంలో వేగం, పారదర్శకత పెంచేందుకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) వ్యవస్థను రూపొందించినట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. అధిక సామర్థ్యం విద్యుత్ వినియోగించే పరిశ్రమలకు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీటర్ రీడింగులను 55 హెచ్‌పీకి మించి సామర్థ్యం ఉంటే ఏడీఈ స్థాయి అధికారి, 55 లోపు హెచ్‌పీ ఉంటే ఏఈ స్థాయి అధికారి స్వీకరిస్తారని వివరించారు. నాన్‌స్లాబ్ రీడింగ్‌ను లైన్ ఇన్‌స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్‌ను ప్రైవేట్, జూనియర్ లైన్‌మెన్లు స్వీకరిస్తారని అన్నారు. ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ విధానంతో తప్పులు జరిగే ప్రసక్తే ఉండదని, విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చు తగ్గులు త్వరితగతిన గుర్తించవచ్చని అన్నారు. ఏఎంఆర్‌లో 4జీ కమ్యూనికేషన్ సిమ్ అమర్చుతామని, దీంతో డేటా హన్మకొండలోని సెంట్రల్ సర్వర్‌కు చేరుతుందని తెలిపారు.
స్వర్ణకవచధారణలో రామయ్య
స్వర్ణకవచధారణలో రామయ్య