
భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్
● పగటి వేళ బ్యాక్‌డౌన్‌లో కేటీపీఎస్ యూనిట్లు ● 6వ దశలో పది రోజులుగా రిజర్వ్ షట్‌డౌన్‌లో 500 మెగావాట్లు
పాల్వంచ: ఇటీవల కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు సోలార్, జల విద్యుత్ సైతం అధికంగా వస్తుండడంతో థర్మల్ విద్యుత్‌ను అంతంతగానే వాడుతున్నారు. ఈ క్రమంలో పాల్వంచలోని కేటీపీఎస్ ఽకర్మాగారంలో తరచూ బ్యాక్‌డౌన్, రిజర్వ్ షట్ డౌన్‌లో యూనిట్లను ఉంచుతున్నారు. కేటీపీఎస్ 5,6,7 దశల కర్మాగారాల్లో మొత్తం 1,800 మెగావాట్లకు గాను మధ్యాహ్నం 800 మెగావాట్లు మాత్రమే ఇక్కడ ఉత్పత్తిని రాష్ట్ర గ్రిడ్‌కు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
పగలు అరకొరగా.. రాత్రి ఫుల్ లోడ్
పగలు విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండడంతో పాటు సోలాల్ ఉత్పత్తిని వినియోగిస్తుండడంతో కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలోని 800 మెగావాట్లకు గాను 450 మెగావాట్లు మాత్రమే తీసుకుంటున్నారు. మిగితాది బ్యాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫుల్ లోడ్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేటీపీఎస్ 5వ దశలోని 8వ యూనిట్ 250 మెగావాట్లలో ఉదయం 175 మెగావాట్లు, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఫుల్ లోడ్ తీసుకుంటున్నారు. 9వ యూనిట్ 250 మెగావాట్లు, 6వ దశలోని 10వ యూనిట్‌ను గత నెల 25 నుంచి రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉంచి పూర్తిగా ఉత్పత్తి నిలిపివేశారు. కాగా 9వ యూనిట్‌లో సుమారు పది రోజుల అనంతరం సోమవారం ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
డిమాండ్ లేకే ఉత్పత్తి
తగ్గిస్తున్నాం
పగలు విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండడంతో పాటు సోలార్ ఉత్పత్తిని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని యూనిట్లను పగలు బ్యాక్‌డౌన్‌లో ఉంచి, రాత్రి ఫుల్ లోడ్ తీసుకుంటున్నారు. ఇక 9, 10 యూనిట్లు గత పది రోజులు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని నిలిపివేసి రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉంచాం.
– ఎం.ప్రభాకర్ రావు, 5, 6వ దశల సీఈ

భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్