
ఇదేం న్యాయం..?
● సింగరేణి మెడికల్ కళాశాలలో దక్కని సరైన వాటా ● సింగరేణీయులకు ఏడు సీట్లే కేటాయిస్తున్న వైనం ● ఏటా దరఖాస్తు చేసుకుంటున్న 200 మంది విద్యార్థులు ● కళాశాలకు స్థలం, రూ. 500 కోట్లు ఇచ్చిన సింగరేణి సంస్థ ● 40 శాతం సీట్లు కేటాయించాలని ఉద్యోగుల డిమాండ్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)లో సింగరేణీయుల పిల్లలకు న్యాయమైన వాటా దక్కడంలేదు. దీంతో కార్మికులు, ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. పెద్దపెల్లి జిల్లా రామగుండంలో ప్రభుత్వం మెడికల్ కళశాల ఏర్పాటు చేయగా సింగరేణి సంస్థ స్థలం ఇచ్చింది. రూ.500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. దీంతో సింగరేణి మెడికల కళాశాలగా పిలుస్తున్నా.. సింగరేణి కార్మికుల పిల్లలకు కేవలం ఐదు శాతం అంటే ఏడే సీట్లే కేటాయించారు. సింగరేణి సంస్థలో సుమారు 40 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి పిల్లలు ఏటా 2 వేల మంది ఎంబీబీఎస్‌లో ప్రవేశం కోసం నీట్ పరీక్ష రాస్తున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏటా సుమారు 200 మంది వరకు సింగరేణి మెడికల్ కళాశాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ఏడుగురికే సీట్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు సూపర్ యానిమేషన్ కింద 40 శాతం సీట్లు పెంచాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నారు.
మెరిట్ సీట్లనూ సింగరేణి కోటాలో చూపుతున్నారు...
ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉద్యోగుల పిల్లలు సుమారు 200 మంది సింగరేణి హెచ్‌ఆర్‌డీ విభాగం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నీట్ పోటీ పరీక్షలో 500 మార్కులు వచ్చిన సింగరేణీయుల పిల్లలు సుమారు 200 మంది వరకు ఉండగా, రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. గతంలో ఇచ్చిన 5శాతం కాకుండా ఈ ఏడాది 40శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ నిర్వాహకులు ఓవరాల్ మెరిట్ వచ్చిన సీట్లను కూడా సింగరేణి కోటాలో చూపుతున్నారని, దీంతో కార్మికుల పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు స్పందించి సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కనీసం 40శాతం సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఏడు సీట్లు ఇవ్వడం సరికాదు..
సింగరేణి యాజమాన్యం మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లతో పాటు స్థలం కేటాయించింది. అయినా కేవలం 5 శాతం అంటే 7 సీట్లు కేటాయించడం సరికాదు. సింగరేణీయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా?
– పీతాంబరరావు, ఐఎన్‌టీయూసీ కార్పొరేట్
ఉపాధ్యక్షుడు
కార్మిక సంఘాలను
సంప్రదించకుండానే..
సింగరేణి యాజమాన్యం కనీసం కార్మిక సంఘాలను సంప్రదించకుండానే నేరుగా ప్రభుత్వానికి రూ.500 కోట్లు సమర్పించింది. అదే కంపెనీ మెడికల్ కళాశాల పెట్టి ఉంటే కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు, పిల్లలకు మెడికల్ సీట్లు వచ్చేవి.
– వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు
ఫిర్యాదు చేస్తాం..
ప్రస్తుత విద్యాసంవతర్సంలో కార్మికులు, అధికారుల పిల్ల లకు కోరిన విధంగా సీట్లు కేటాయింపు జరగాలి. లేకపోతే ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం. సీట్ల పెంపునకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన చేస్తాం.
– రియాజ్ అహ్మద్, హెచ్‌ఎంఎస్
ప్రధాన కార్యదర్శి
సీట్ల పెంపు పరిశీలనలో ఉంది..
మెడికల్ కళాశాల సీట్ల పెంపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు మెరిట్‌తో సంబంధం లేకుండా సీట్లు పెంచే యోచనలో ఉంది. కార్మికులకు మెరుగైన వైద్యం కూడా అందించాలని భావిస్తోంది. ఉద్యోగుల అభివృద్ధి, సంక్షేమమే మాకు ప్రథమ ప్రాధాన్యం.
– ఎన్.బలరామ్, సీఎండీ

ఇదేం న్యాయం..?

ఇదేం న్యాయం..?

ఇదేం న్యాయం..?

ఇదేం న్యాయం..?