
ఉద్యోగుల అశ్రద్ధతోనే లోపాలు
● విద్యాసంస్థల్లో తప్పు జరిగితే సిబ్బందిపై క్రిమినల్ కేసు ● భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్
ఖమ్మంమయూరిసెంటర్: ఏడాదికాలంగా గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో విద్యార్థులకు చదువు, ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, కానీ ఇటీవల సిబ్బంది నిర్లక్ష్యం, వార్డెన్లు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్ల అశ్రద్ధతో లోపాలు వెలుగు చూస్తున్నాయని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఎంలు, వార్డెన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులకు అల్పాహారం, భోజనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కల్లూరు పాఠశాలలో జరిగిన ఘటనను హెచ్చరికగా భావించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ఇలాంటి పొరపాట్లు ఎక్కడ జరిగినా సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పీఓ హెచ్చరించారు. వండిన ఆహారాన్ని ముందుగా ప్రిన్సిపాల్, హెచ్‌ఎం, వార్డెన్, ఉపాధ్యాయులు తిన్నాకే విద్యార్థులకు వడ్డించాలని పీఓ రాహుల్ స్పష్టం చేశారు.
●గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఖమ్మంలోని పీఎంహెచ్ బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. బోధన, మెనూపై ఆరా తీయడమే కాక భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా తీరిక సమయంలో పుస్తకాలు చదవాలని సూచించారు. అనంతరం గిరిజన భవనాన్ని సందర్శించిన పీఓ శుభకార్యాల నిర్వహణకు ఇచ్చేలా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. తొలుత పీఓ ఖమ్మంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌ను సందర్శించి క్రయవిక్రయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీఓ(జనరల్) డేవిడ్‌రాజ్, డీడీ విజయలక్ష్మి, ఉద్యోగులు నారాయణరెడ్డి, యు.భారతిదేవి పాల్గొన్నారు.