
గ్రామాలకు వెళ్లకుండానే హాజరు
● పంచాయతీ కార్యదర్శుల ఇష్టారాజ్యం ● జిల్లా వ్యాప్తంగా 42 మందికి నోటీసులు ● బూర్గంపాడు మండలంలో అత్యధికంగా ఏడుగురు ● వారిని పర్యవేక్షించాల్సిన ఎంపీఓలపైనా చర్యలు
చుంచుపల్లి: పల్లె పాలనపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంచా యతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఏడాదిన్నర నుంచి గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించారు. వేర్వేరు శాఖల నుంచి ప్రతీ గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించారు. వారిలో కొందరికి గ్రామాలపై అవగాహన లేకపోవడం, ఇతర బాధ్యతలు తదితర కారణాలతో పల్లె పాలన అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు మండల పంచాయతీ అధికారులు (ఎంపీఓలు) కూడా దృష్టి పెట్టడంలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరుకాకుండానే హాజరైనట్లు హాజరు నమోదు చేసుకుంటున్నారు.
గ్రామాలకు వెళ్లకుండా పంచాయతీ
సిబ్బందితో హాజరు నమోదు!
పచాయతీ కార్యదర్శులు ఉదయం 10గంటల లోపు గ్రామానికి వెళ్లి డీఎస్‌ఆర్ (డెయిలీ శానిటేషన్ రిపోర్టు) ముఖ గుర్తింపు యాప్ ద్వారా సెల్ఫీ ఫొటో దిగి హాజరు నమోదు చేసుకోవాలి. అనంతరం పారిశుద్ధ్య పనుల ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయాలి. అయితే కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు వెళ్లకుండానే తన మొబైల్‌లో ఫొటో దిగి దానిని వాట్సాప్ ద్వారా పంచాయతీ సిబ్బందికి పంపి, ఓటీపీ చెబుతూ రోజువారీ హాజరు నమోదు చేసుకుంటున్నారు. ఇంకొందరు పంచా యతీ కార్మికుల ఫోన్లలోనే యాప్ ఇన్‌స్టాల్ చేశారు. దీంతో కార్మికులే డీఎస్‌ఆర్ యాప్‌లో కార్యదర్శి హా జరు వేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పాతఫొటోలు, సంబంధం లేదని ఫొటోలను అప్‌లోడ్ చేస్తుండటంతో జూలైహాజరులో అధికారులు గుర్తించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 553 మందిని గుర్తించగా, జిల్లాకు చెందిన వారు 42 మంది కార్యదర్శులు ఉన్నారు. బూర్గంపాడు మండలంలో, పాల్వంచ మండలంలో ఆరుగురు ఉన్నారు. భద్రాచలంలో ఒకరు, చర్లలో ఇద్దరు, దమ్మపేటలో ఇద్దరు, దుమ్ముగూడెంలో ఇద్దరు, గుండాలలో ఐదుగురు, కరకగూడెంలో ఇద్దరు, ఆళ్లపల్లిలో ఇద్దరు, అశ్వాపురంలో ముగ్గురు, లక్ష్మీదేవిపల్లిలో ఇద్దరు, మణుగూరులో ఒకరు, ములకలపల్లిలో ముగ్గురు, సుజాతనగర్‌లో ఒకరు, టేకులపల్లిలో ఒకరు, ఇల్లెందు మండలంలో ఇద్దరు తప్పుడు హా జరు నమోదు చేసినట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాల్సిన ఎంపీఓలు, ప్రత్యేక అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ 42 మంది కార్యదర్శులతో పాటు 17 మంది ఎంపీఓలను బాధ్యులను చేస్తూ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు హాజరు నమోదు విషయం తేలడంతో ఇకనుంచి పంచాయతీ కార్యదర్శుల ఆన్‌లైన్ హాజరును నిత్యం మండల, డివిజనల్, జిల్లా పంచాయతీ అధికారులు పరిశీలించాలని పీఆర్ డైరెక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులను సైతం బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
చర్లలో ఇద్దరికి నోటీసులు
చర్ల: చర్ల మండలంలో కుదునూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి భూక్యా శరత్‌బాబు, సీ కత్తిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి గుగులోతు రాంబాబులకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నోటీసులు జారీ చేశారు. శరత్‌బాబు 17 రోజులు, రాంబాబు 11 రోజులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేశారు. కాగా మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
చర్యలు తప్పవు
పంచాయతీ కార్యదర్శులు తప్పుడు హాజరు నమోదు చేసినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 42మంది పంచాయతీ కార్యదర్శులకు, 17మంది ఎంపీఓలకు నోటీసులు జారీ చేశాం. వివరణ అనంతరం వారిపై చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి కార్యదర్శులపై పర్యవేక్షణ పెంచుతాం.
–వి.చంద్రమౌళి, డీపీఓ

గ్రామాలకు వెళ్లకుండానే హాజరు