
పేదరికమే అర్హతగా పథకాలు
తిరుమలాయపాలెం: ఎవరికి ఓటు వేశారనేది పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పేదరికమే అర్హతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, మూడు విడతల్లో మిగతా వారికి సైతం ఇస్తామని వెల్లడించారు. తిరుమలాయపాలెంలో రూ.3.30 కోట్లతో నిర్మించే బీటీ రహదారులకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఆతర్వాత ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయగా మంత్రి మాట్లాడారు. తిరుమలాయపాలెంకు ఐటీఐ కేటా యించగా, 30 పడకల ఆస్పత్రిని రూ.26 కోట్లతో 50 పడకలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుండగా తమ ప్రభుత్వానికి దీవెనలు అందించాలని పొంగులేటి కోరారు. కాగా, భూభారతి చట్టం ఈనెల 15 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని తెలిపారు.
చేత కాకపోతే రాజీనామా చేయండి
‘జల్లెపల్లిలో డెంగీతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిసినా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించడం సరికాదు... చేతకాకుంటే రాజీనామా చేయండి’ అని ఎంపీడీఓ సిలార్‌సాహెబ్‌ను మంత్రి పొంగులేటి హెచ్చరించారు. జల్లేపల్లిలో సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ‘ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా.. నీ కోసం ప్రత్యేక జీఓ తేవాలా? నువ్వే పరిపాలన చేయ్.. లేకుంటే రాజీనామా చేయ్’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా, మండలంలోని బలరాంతండాకు చెందిన శివ కానరావడం లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన తల్లి లలిత మంత్రి దృష్టికి తీసుకురాగా, పోలీసులకు పొంగులేటి సూచనలు చేశారు.
ఎవరికి ఓటు వేశారో అడిగేది లేదు..
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి