తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

Aug 5 2025 6:32 AM | Updated on Aug 5 2025 6:32 AM

తల్లి

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

అశ్వారావుపేటరూరల్‌: తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని, తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలే పట్టాలని డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా సూచించారు. సోమవారం అశ్వారావుపేటలోని గెస్ట్‌హౌస్‌ ఏరియా అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అశ్వారావుపేట సెక్టార్‌ పరిధిలో ఏడు నెలలు నిండిన పిల్లలకు అదనపు ఆహారం అందించి, అన్నప్రాసన చేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. వయస్సుకు తగిన బరువు ఉన్న పిల్లలను గుర్తించి బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం అమ్మ సేవా సదనంతోపాటు పలు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో సీడీపీవో ముత్తమ్మ, సూపర్‌వైజర్లు ఇమ్మడి పద్మావతి, సౌజన్య, రమాదేవి, వరలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

ప్రయాణికుల నిజాయితీ

బూర్గంపాడు: ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన పెరిక రోశయ్య, చల్లా లక్ష్మీనారాయణ, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామానికి చెందిన బాదావత్‌ లలిత సోమవారం ఆటోలో వెళ్తున్న క్రమంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వద్ద పర్సు కనిపించింది. ఆటో ఆపి పర్సును తీసి పరిశీలించగా, రూ.16వేల నగదు, ఆధార్‌కార్డు ఉన్నాయి. ముగ్గురు వ్యకులు పర్సును పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు ఆధార్‌కార్డు ఆధారంగా బాధితుడిని రప్పించి అందజేశారు. బూర్గంపాడు నుంచి భద్రాచలం వెళ్తున్న క్రమంలో జేబులో నుంచి పర్సు జారిపడిందని బాధితుడు, ఆటోడ్రైవర్‌ మాడుగుల ప్రశాంత్‌ తెలిపాడు. నిజాయితీ చాటుకున్న ముగ్గురు వ్యక్తులను ఎస్‌ఐ మేడ ప్రసాద్‌ అభినందించారు.

కబడ్డీ క్రీడాకారుల ఎంపిక

కరకగూడెం: మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9 వరకు హైదరాబాద్‌లో జరిగే పోటీలకు తోలెం ప్రసాద్‌, బాలకృష్ణ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. కాగా వీరు గతంలో ప్రో కబడ్డీ లీగ్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

వరకట్న వేధింపుల

కేసు నమోదు

చండ్రుగొండ: పోలీసులు సోమవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన నల్లగట్ల ఆశాకు ఖమ్మం అల్లీపురం గ్రామానికి చెందిన నాగేంద్రబాబుతో 2022లో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు సంతానం కలిగారు. కొంతకాలంగా భర్త నాగేంద్రబాబు, అత్త నాగమ్మ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

లాడ్జీలో హైదరాబాద్‌ పోలీసుల తనిఖీలు!

భద్రాచలంటౌన్‌: పట్టణంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జీలో మైనర్లకు రూమ్‌ ఇచ్చిన ఘటనలో హైదరాబాద్‌ పోలీసులు తనిఖీలు చేసినట్లు సమాచారం. వారం రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన బాలుడు, బాలిక పట్టణంలోని ఓ లాడ్జీలో బస చేసినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం వచ్చి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని సీఐ నాగరాజు తెలిపారు.

20 తులాల బంగారం చోరీ

కొత్తగూడెంటౌన్‌: టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రుద్రంపూర్‌ నాలేరియాకు చెందిన సింగరేణి ఉద్యోగి వి.వెంకటరమణ ఇంట్లో 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ జరిగింది. సీఐప్రతాప్‌ కథనం ప్రకారం... వెంకట రమణ జీఎం కార్యాలయంలో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో పరిశీలించగా దొంగలు బీరువాను పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును చోరీ చేశారు. స్థానికుల సమాచారంతో క్లూస్‌ టీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్యూన్‌ బస్తీలో నిర్మాణంలో ఉన్న ఇంటి అవసరాల కోసం దాచి ఉంచిన బంగారం, నగదు అపహరించారని బాధితురాలు ఆవేదనవ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం1
1/1

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement