
అమ్మవారికి శఠగోపం!
● పెద్దమ్మగుడి ఏసీ ఫంక్షన్ హాళ్లకు వేలంపాట ● పోటీ లేదంటూ అతి తక్కువ ధరకే కట్టబెట్టిన ఆలయ అధికారులు ● గతేడాది కంటే రూ. 31 లక్షలు మైనస్ ● కొబ్బరి చిప్పలకు పెరిగిన రూ.1.80 లక్షలు..
పాల్వంచరూరల్: అమ్మవారి ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా ఎండోమెంట్ అధికారులు మాత్రం ఫంక్షన్ హాళ్లకు తక్కువ ధరకే కట్టబెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో సోమవారం వ్యాపార దుకాణాలు, ఫంక్షన్ హాళ్లకు ఉమాసోమలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ వీఎల్‌వీ వెంకట్రావు పర్యవేక్షణలో టెండర్ కం బహిరంగ వేలంపాట నిర్వహించారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు ఏడాది కాలానికి భద్రాచలానికి చెందిన ఎస్.వెంకట చెంచు సుబ్బారావు రూ.17,01,000 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఇదే కొబ్బరి చిప్పలకు రూ.15.20 లక్షలు వచ్చాయి. ఈసారి రూ.1.80 లక్షల ఆదాయం అదనంగా పెరిగింది.
ఫంక్షన్ హాళ్లకు తక్కువ పాట
700 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఏసీ ఫంక్షన్ హాల్ ఏడాదికి రూ.26 లక్షల 55వేలకు పాల్వంచకు చెందిన ఆకుల ఆనంద్ దక్కించుకున్నారు. గతేడాది ఇదే హాల్‌కు వేలంపాటలో రూ.40 లక్షల 4 వేలు వచ్చాయి. ఈసారి మాత్రం రూ.13 లక్షల 49 వేల ఆదాయం తగ్గింది. 500 సీటింగ్ సామర్థ్యం కలిగిన మరో ఏసీ ఫంక్షన్‌హాల్ ఏడాదికి రూ.16.20 లక్షలకు కాంపెల్లి కనకేష్ దక్కించుకున్నారు. ఇదే ఫంక్షన్‌హాల్ గతేడాది రూ.34 లక్షల 2వేలు పలికింది. ఈసారి రూ.16 లక్షల 20వేలకు ఇవ్వడంతో ఆలయానికి రూ.18 లక్షల 32 వేల ఆదాయం తగ్గింది. రెండు ఫంక్షన్ హాళ్లపై ఈ ఏడాది అమ్మవారి ఆలయం సుమారు రూ. 31 లక్షల ఆదాయం కోల్పోయింది. ఇంత తక్కువకు రెండు ఫంక్షన్ హాళ్లను అప్పగించడం భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఈఓ రజనీకుమారిని వివరణ కోరగా.. మూడు, నాలుగుసార్లు టెండర్లు పిలిచినా పాట దారులు ఎవరూ ముందుకు రాలేదని, చివరిగా తగ్గించి వారికి కేటాయించామని చెప్పుకొచ్చారు. కాగా ఒకటో నంబర్ దుకాణానికి పాటదారులు ఎవరూ ముందుకురాని కారణంగా వాయిదా వేసినట్లు పెద్దమ్మగుడి ఈఓ రజనీకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు పాపారావు, శ్రీను, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.