
తొలకరి పలకరించే వేళ..
● పులకించనున్న పుడమితల్లి ● రైతు మోమున వెల్లివిరియనున్న ఆనందం ● సాగుకు అన్నదాత సన్నద్ధం ● నేడు ఏరువాక పౌర్ణమి
ఇల్లెందురూరల్: తొలకరి పలకరింపుతో రైతులు వ్యవసాయ పనులకు ముందడుగు వేస్తున్నారు. ఆధునికత ఎంత పెరిగినా తొలకరి వేళ నాగళ్లతోనే దున్నేందుకు ఆసక్తి చూపుతారు. జిల్లా వ్యాప్తంగా సాగుకు సన్నద్ధమైన రైతులు.. బుధవారం ఏరువాకపౌర్ణమి పండుగను సంప్రదాయ పద్ధతులతో జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సంప్రదాయ వేడుక..
ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే తొలిసారి పొలం దున్నడమని అర్థం. వ్యవసాయ పనుల ప్రారంభానికి సూచికగా రైతులు ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ రోజున మొదట నాగలితో దుక్కిదున్ని భూమి పూజ చేస్తారు. తద్వారా పంటలు బాగా పండుతాయని, తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని రైతుల విశ్వాసం.
సమష్టి సాగుకు దిక్సూచి..
వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మాసం వచ్చాక చిరుజల్లులు కురుస్తుంటాయి. భూమి కొంత మేర పదును ఎక్కాక నాగలితో దున్నేందుకు అనువుగా ఉంటుంది. అందుకే రైతులంతా సమష్టిగా వ్యవసాయ పనుల ప్రారంభానికి ఏరువాక పౌర్ణమిని ఎంచుకుంటారు. కొంతమంది అంతకుముందే మొదలుపెట్టినా.. అలా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయని ఎక్కువ మంది రైతులు నమ్ముతుంటారు.
పనిముట్లు, పశుసంపదకు పూజ..
ఏరువాక పౌర్ణమి రోజున వ్యవసాయ పనిముట్లను కడిగి శుభ్రం చేసుకుంటారు. పశువులకు కూడా శభ్రంగా స్నానం చేయించి వస్తువులకు, ఎద్దులకు పసుపు, కుంకుమ చల్లుతారు. కాళ్లకు గజ్జలు అలంకరించి హారతులిస్తారు. మేళతాళాలతో ఊరేగిస్తారు. అనంతరం శ్రేష్టమైన ఆహారాన్ని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. తమ ఇష్ట దైవాలకు సైతం పూజలు చేశాక పొలానికి వెళ్లి దుక్కులు దున్నడం ప్రారంభిస్తారు.
పండుగను విస్మరిస్తున్నారు..
తొలకరి పలకరించిన వేళ వ్యవసాయం సంబురంగా సాగాల ని రెతులు జరుపుకునే పండుగే ఏరువాక పౌర్ణమి. తరతరాల సంప్రదాయాన్ని ప్రోత్సహించాల్సిన పాలకులు సైతం ఆ వేడుకను విస్మరిస్తున్నారు. రైతులకు కనీసం అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉంది.
– చింత రామ్మూర్తి,అన్నారం, ఇల్లెందు మండలం
సంప్రదాయం కనుమరుగవుతోంది
వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు రైతులు భూ మిపూజ చేయడం, సాగుకు అవసరమైన ఎద్దులు, పని ముట్లను పూజించడం అనాది గా వస్తున్న ఆచారం. అయితే ప్రస్తుత రోజుల్లో వర్షం కురిసిన వేళ విత్తనాలు వేయడం మినహా రైతులు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పాటించడం లేదు.
–ధనియాకుల బాబు,చల్లసముద్రం,ఇల్లెందుమండలం

తొలకరి పలకరించే వేళ..

తొలకరి పలకరించే వేళ..