చీరాల రూరల్: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో ముస్లిం మైనార్టీకి చెందిన సయ్యద్ తౌషిక్ హత్యకు, బాలుడి తల్లి మౌలాబీ ఆత్మహత్యకు కారకులైన సంఘటనలో నిజాలు నిగ్గు తేలాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి చీరాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే బషీర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.... తల్లి, కుమారుడి మరణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా ప్రభుత్వ పెద్దలు బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో సమాధానం చెప్పాలన్నారు. న్యాయం జరగకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 12న ఒంగోలులో నిర్వహించే మహాధర్నాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలపై నిత్యం దాడులు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు కూడా ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు డాక్టర్ వరికూటి అమృతపాణి, ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షుడు షేక్ బషీర్, ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు మోహన్ కుమార్ ధర్మ, డాక్టర్ మాచర్ల మోహనరావు తదితరులు తమ ప్రసంగంలో టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సమావేశంలో చుండూరు వాసు, శీలం రవికుమార్, షేక్ జిలాని, అలీం, తేళ్ల వెంకటస్వామి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, మార్పు గ్రగోరి, దుడ్డు విజయ్‌సుందర్, గొర్రెపాటి రవికుమార్, బుడంగుంట్ల లక్ష్మీనరసయ్య, గుమ్మడి ఏసురత్నం, న్యాయవాదులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


