పారిశుద్ధ్యం, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి

Oct 8 2026 3:24 AM | Updated on Oct 8 2026 3:24 AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఆదర్శం

బాపట్ల: జిల్లాలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సర కాలంలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ నివేదికల మేరకు అధికారులను ఆరా తీశారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని అన్నారు. వంద శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, హాజరు విషయంలో గూగుల్‌ షీట్‌ తయారు చేసి వివరాలను నమోదు చేయాలన్నారు. కాలువలను వంద శాతం శుభ్రంగా ఉంచాలన్నారు. వీధి దీపాల నిర్వహణలో బాపట్ల పనితీరు సరిగా లేదని ఆయన అన్నారు. అందుకు గల కారణాలను పురపాలక సంఘ డీఈని అడిగి తెలుసుకున్నారు. రేపల్లె, చీరాల పురపాలక సంఘాల పరిధిలో లేని సమస్యలు బాపట్లలో తలెత్తడానికి గల కారణాలను ఆయన ఆరా తీశారు. వీధి దీపాల నిర్వహణ విషయంలో ఏపీసీపీడీసీఎల్‌ అధికారులతో సమన్వయం చేసుకొని వీధి దీపాలు సకాలంలో వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు వస్తే అమ్యూనిటీ సెక్రటరీలు 12 గంటల్లోపు చర్యలు తీసుకోవాలన్నారు. కావలసిన పరికరాలను వెంటనే సేకరించాలన్నారు. కాలువల శుభ్రత, ఇంటి నుంచి చెత్త సేకరణ, సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం, వీధి దీపాల నిర్వహణ మొదలైన అంశాల్లో బాపట్ల పురపాలక సంఘం వెనుకబడి ఉందని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణలో అభివృద్ధి కనబరచాలని అన్నారు. రాబోయే సమావేశాల్లో సచివాలయాల వారీగా సమీక్ష నిర్వహిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పురపాలక సంఘ డీఈ కృష్ణారెడ్డి, వీక్షణ సమావేశం ద్వారా బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డ్‌ ఎమ్యూనిటీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల: అభివృద్ధి పనులకు పునాదులు వేస్తేనే వేగంగా పనులు ముందుకు సాగుతాయని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. గుంతల రహిత రహదారులతో ప్రజలు సాఫీగా ప్రయాణం సాగించాలని, ప్రభుత్వ ఉద్దేశాలను అధికారులు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ చెప్పారు. పాండురంగాపురం–బాపట్ల రహదారి విస్తరణ పనులను రూ.14.80 కోట్లతో 18 కిలోమీటర్లు చేపట్టాలన్నారు. ఎండీఆర్‌ నిధులతో వెల్లటూరు–జువ్వలపాలెం రహదారి పనులకు రూ.4 కోట్లు మంజూరు చేయగా, త్వరగా ప్రారంభించాలన్నారు. చందోలు బ్రిడ్జి నుంచి నిజాంపట్నం వరకు రూ.3 కోట్లతో నిర్మించే రహదారి పనులు డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. మాచవరం–అల్లూరు మధ్య రూ.5 కోట్లతో చేపట్టిన పనులు జనవరిలోగా పూర్తి చేయాలన్నారు. రూ.3 కోట్లతో బాపట్ల–పర్చూరు రహదారి పనులు, రూ.4 కోట్లతో బ్రాహ్మణకోడూరు–భట్టిప్రోలు–రేపల్లె మధ్య చేపట్టే రహదారి పనులు డిసెంబర్‌లోగా, రూ.2 కోట్లతో గుంటూరు–చీరాల మధ్య నిర్మించే రహదారి పనులు వారంలో పూర్తి చేయాలన్నారు. జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల భవనాల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ తెలిపారు. ఏపీ ఈడబ్ల్యూఐడీసీ కింద చేపడుతున్న 29 పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఆటిజం స్వర్ణ భవిత కేంద్ర అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. 173 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు నూతన భవనాలు నిర్మించాల్సి ఉండగా, జాప్యం చేయరాదన్నారు. వీబీ జీరాంజీ కింద 76 భవనాలు నిర్మిస్తుండగా, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద మరికొన్ని, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరికొన్ని భవనాలను నిర్మిస్తున్న తీరుపై ఆయన ఆరా తీశారు. ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో ప్రభుత్వ వైద్యశాలల్లో నిర్మిస్తున్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. సామాజిక భవనాలు, ఫెసిలిటేట్‌ సెంటర్లు డిసెంబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఓ షాలేమురాజు, టీఆర్‌ఎస్‌ సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎస్‌. విజయమ్మ, సీహెచ్‌ఎస్‌ పద్మావతి, ఆర్‌ అండ్‌ బీ ఈఈ వేణుగోపాల్‌, వివిధ శాఖల అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement