పచ్చ సిండికేట్లు! | - | Sakshi
Sakshi News home page

పచ్చ సిండికేట్లు!

Oct 8 2026 3:24 AM | Updated on Oct 8 2026 3:24 AM

పచ్చ సిండికేట్లు! ● మద్యం షాపుల దరఖాస్తులపై నీలినీడలు ● గడువు పెంచినా కనిపించని స్పందన ● సిండికేటుగా మారిన కూటమి నేతలు ● నేడు కలెక్టర్‌ సమక్షంలో లాటరీ ప్రక్రియ

చీరాల: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు తొలుత అక్టోబర్‌ 1వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రభుత్వం గడువు విధించింది. అయితే, జిల్లాలో తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపుకు 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయడానికి వీలు ఉంటుంది. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆశించిన స్థాయిలో స్పందన కానరాకపోవడంతో గత్యంతరం లేక దరఖాస్తు గడువును అక్టోబర్‌ 6వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రభుత్వం పొడిగించింది. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు.

నేడు 24 షాపులకు లాటరీ

సర్కారు గల్లా పెట్టెకు అదనపు కిక్కు కోసం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మద్యాన్ని విచ్చలవిడిగా ఎన్నికల తాయిలాలుగా వాడుకునేందుకు మద్యం పాలసీని మరో ఏడాది పొడిగించినట్లుగా విమర్శలు వినిపించాయి. ఈ నెల 2వ తేదీతో మద్యం షాపుల రెండేళ్ల లైసెన్స్‌ గడువు తీరింది. దీంతో తిరిగి ఏడాది పాటు లైసెన్స్‌ పొడిగించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. లైసెన్స్‌ ఫీజులు పెంచడంతో ఏడాది కాలానికి అంత మొత్తంలో చెల్లించలేమంటూ మరికొందరు వెనుతిరిగారు. జిల్లాలో మొత్తం 128 షాపులు ఉన్నాయి. వీటిలో 94 షాపులు రెన్యువల్‌ చేసుకున్నారు. మిగిలిన 34 షాపులకు లాటరీ ద్వారా కేటాయింపు చేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు. అయితే దరఖాస్తులు రాకపోవడంతో 20 షాపులకే గురువారం లాటరీ నిర్వహించనున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందన్న చందంగా ప్రస్తుతం ఎకై ్సజ్‌ శాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. ఎక్కువ దరఖాస్తులు వస్తాయని ఆశించినా ప్రయోజనం లేకపోవడంతో ప్రస్తుతానికి లాటరీని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన షాపులకు కూడా త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. గురువారం ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో మద్యం షాపులకు సంబంధించి లాటరీని నిర్వహించనున్నారు.

అంతా మాయాజాలం

గతంతో పోలిస్తే ఫీజులను ఏకంగా 10 శాతం పెంచడంతో పాటు రెన్యూవల్‌, పర్మిట్‌ రూమ్‌ల పేరుతో ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తోందని వ్యాపారులు మండిపడుతున్నారు. భారీగా లాభాలు తెచ్చిపెట్టే దుకాణాలను అధికార పార్టీ సిండికేట్‌ శక్తులు ఇప్పటికే రెన్యూవల్‌ చేసుకోగా, వ్యాపారం సరిగా సాగని, నష్టాలు వచ్చే షాపులను మాత్రం గాలికొదిలేశారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే నాన్‌–రీఫండబుల్‌ ఫీజుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరేది. కానీ, అధికార పార్టీ నేతలు సిండికేట్లు కట్టి పోటీ లేకుండా చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. ఇప్పటికే టీడీపీ సిండికేట్లు దుకాణాలు దక్కించుకుని అందిన కాడికి జేబులు నింపుకొంటున్నాయి. మద్యం బెల్టుషాపులకు తరలుతున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారు. పైగా వైన్‌షాపుల వద్ద అధిక ధరలు వసూలు చేస్తున్నా చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమైంది. సమయ పాలన కూడా పాటించకపోవడంతో నిత్యం యువత మద్యం తాగి మత్తులో జోగుతోంది. దీనివలన శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. పైగా నిరుపేద కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి.

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోంది. మద్యం ద్వారా భారీగా ఆదాయం దండుకోవాలని భావించిన ప్రభుత్వానికి సొంత పార్టీ నేతల నుంచే చుక్కెదురవుతోంది. జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. అధికార పార్టీ నేతల సిండికేట్‌ దందాలకు వేదికగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement